మునుగోడు నేర్పిన గుణపాఠం ఏంటి..?
తెలంగాణ ప్రజలను అంచనా వేయడంలో బీజేపీ పెద్దలు బోల్తా కొట్టేశారు. ఉప ఎన్నిక మంచి ఉద్దేశంతో వచ్చిందా..? లేక కొందరు నేతలు తిన్నది అరక్క తెచ్చిపెట్టారా అన్న దానిపై మునుగోడు ప్రజలకు తొలిరోజుల్లోనే స్పష్టత వచ్చేసింది.
తెలంగాణ ప్రజలతో మోడీ- అమిత్ షాలు మైండ్ గేమ్ మొదలుపెట్టి చాలా కాలమైంది. కొందరు నాయకులు వ్యక్తిగత బలాన్నే పార్టీ బలంగా చూపించి.. ఓవరాల్‌గా తెలంగాణలో విపరీతంగా బీజేపీ బలపడిందన్న భ్రాంతిని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎంపిక కూడా అమిత్ షా ఆ కోణంలోనే చేశారు.
మునుగోడులో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యక్తిగతంగా బలం ఉంది. ఆ బలంపైనే అమిత్ షా కన్నుపడింది. రాజగోపాల్ రెడ్డితో రాజీనామా చేయించి, అక్కడ ఉప ఎన్నిక తెచ్చి, వందల కోట్లు కుమ్మరించైనా సరే టీఆర్‌ఎస్‌ను ఓడిస్తే ప్రజల్లో బీజేపీపై గురి కుదురుతుందని భావించారు. బలిపీఠంపై తల పెడుతున్నందుకు ఏకంగా 18వేల కోట్ల రూపాయల కాంట్రాక్టును రాజగోపాల్ రెడ్డి అప్పగించేందుకు కేంద్రం ప్రభుత్వం ఓకే చెప్పింది. ఉప ఎన్నిక రప్పించడం వరకు బీజేపీ అనుకున్నట్టుగానే జరిగింది.
కానీ, తెలంగాణ ప్రజలను అంచనా వేయడంలో బీజేపీ పెద్దలు బోల్తా కొట్టేశారు. ఉప ఎన్నిక మంచి ఉద్దేశంతో వచ్చిందా..? లేక కొందరు నేతలు తిన్నది అరక్క తెచ్చిపెట్టారా అన్న దానిపై మునుగోడు ప్రజలకు తొలిరోజుల్లోనే స్పష్టత వచ్చేసింది. 18వేల కాంట్రాక్టు ఇచ్చి ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను పరోక్షంగా కొనేసి ప్రతిపక్ష స్థాయి కూడా లేని మరో పార్టీ తరపున పోటీ చేయిస్తున్నారంటే ఇది ముమ్మాటికి తెలంగాణపై దాడే అన్న భావనకు మునుగోడు ప్రజలొచ్చారు.
అర్థం లేని ఎన్నికను తెస్తే రాజగోపాల్ అయినా, మరొకరైనా సరే పాతరేస్తామని నిరూపించారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు, తాము బలపడుతున్నామని చెప్పుకునేందుకు సిల్లీగా రాజకీయాలు చేస్తే తొక్కేస్తామని ప్రజలు నిరూపించారు. వందల కోట్లు పంచినా.. తమకు నచ్చినవారికే ఓటేస్తామని మునుగోడు ప్రజలు నిర్ధారించారు. వందల కోట్లు పంచే సామర్థ్యం ఉన్న రాజగోపాల్‌నే పడేశాం.. కాబట్టి మరికొందరు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారితో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలు తెచ్చే పిచ్చిపనులు చేయొద్దని బీజేపీ పెద్దలకు స్పష్టమైన సంకేతం పంపారు. ఆదరిస్తున్నంత మాత్రాన తాము మీ బానిసలం కాదు.. చెప్పినట్టు తలూపడానికి అని కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజలు సంకేతాలిచ్చారు.
నిజానికి బరిలో ఉన్నది రాజగోపాల్ రెడ్డి కాబట్టి ఆ మాత్రం పోటీ ఇవ్వగలిగింది బీజేపీ. అదే సొంత బలం కూడా లేని ఎమ్మెల్యేలను తీసుకుని.. ఉప ఎన్నికకు వెళ్లి ఉంటే బీజేపీ అసలు బలం ఏంటో తెలిసిపోయేది. దుబ్బాకలో రఘునందన్‌పై ఉన్న సానుభూతి పనిచేసింది. ఈటల రాజేందర్.. తనను అవమానించారని బాధపడితే ఆ సానుభూతి పనిచేసింది. ఆ రెండు చోట్ల కూడా అది బీజేపీ బలం కానేకాదు. ఈటల తరహాలోనే మరో ప్రయోగం చేసేందుకు రాజగోపాల్ రెడ్డిని తెచ్చారు. కానీ, ఇక్కడ ఆయన్ను ఎవరూ గిల్లింది లేదు, కొట్టింది లేదు అన్నది ప్రజలకు తెలుసు. ఆయనకు ఆయనే మాజీ అయ్యేందుకు ఉబలాటపడే ఎన్నికకు వచ్చారని ప్రజలు భావించి ఆ కోరికను ఇలా తీర్చారు. సో.. పిచ్చిపిచ్చి కారణాలతో ఉప ఎన్నికని వస్తే తాట తీస్తామన్నది ప్రజలు నేర్పిన గుణపాఠం.