ఎన్నికలకు ముందే మునుగోడు రికార్డ్.. కొత్త ఓట్ల కోసం 23వేల దరఖాస్తులు..
ఆరోపణలు, ఫిర్యాదుల సంగతి పక్కనపెడితే.. 12 శాతం కొత్త ఓట్లు అంటే ఎన్నికల ఫలితాన్నే ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు.
మునుగోడులో కొత్త ఓట్లకోసం భారీగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఏకంగా 23వేల దరఖాస్తులు వచ్చాయి. ఏడాదిన్నర క్రితం నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు ముందు కొత్తగా ఓటు హక్కుకోసం కేవలం 1500మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. దానికి దాదాపు 15రెట్లు ఎక్కువగా మునుగోడులో దరఖాస్తులు వచ్చాయి. మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుండటంతో కొత్త ఓట్ల నమోదు విషయంలో నాయకులంతా అలర్ట్ గా ఉన్నారు. ఒక్క ఓటు అదనంగా చేరినా అది తమకు అదనపు బలం అని అంచనా వేస్తున్నారు. అందుకే ఓట్ల నమోదులో మునుగోడు రికార్డ్ సాధించింది.
ఓటుకు నోటు కోసమేనా..?
ఓటర్లంతా ఓటుకు నోటు తీసుకుంటారని చెప్పలేం కానీ, అడక్కముందే నోట్లు ఇస్తామంటూ పార్టీలు ఎగబడితే ఎవరు మాత్రం కాదంటారు. మునుగోడులో ఓటు 10వేల రూపాయల వరకు పలుకుతుందని అంచనా. దీంతో ఇతర ప్రాంతాలనుంచి వలస వచ్చినవారు, కొత్త కోడళ్లు.. తమ ఓట్లను బదిలీ చేసుకోడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఈసారి మునుగోడులో ఓటర్ల సంఖ్య భారీగా పెరుగుతోంది, పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశముంది.
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉన్న మునుగోడు నియోజకవర్గ ప్రజలంతా తమ తమ ఓట్లను మునుగోడుకు బదిలీ చేసేందుకు దరఖాస్తులు చేసుకున్నారు. సాధారణంగా ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని ఓట్ల సంఖ్యలో 2శాతం అదనంగా కొత్త ఓట్లకోసం దరఖాస్తులు వస్తాయి. కానీ మునుగోడు నియోజకవర్గంలో కొత్త ఓట్లకోసం 12శాతం దరఖాస్తులు రావడం విశేషం.
బీజేపీ వ్యూహం..
హైదరాబాద్ కేంద్రంగా కొత్త ఓట్లకోసం దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా ఇలా దరఖాస్తులు చేయించి ఉంటారని టీఆర్ఎస్ అనుమానిస్తోంది. అధికారులు అన్నీ పక్కాగా నిర్థారించుకున్న తర్వాతే కొత్త ఓట్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు టీఆర్ఎస్ నేతలు. విచిత్రం ఏంటంటే.. బీజేపీ, టీఆర్ఎస్ పై ఆరోపణలు చేయడం. ఇలా కొత్త ఓట్ల దరఖాస్తుల సంఖ్య పెరగడానికి కారణం మీరంటే మీరంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆరోపణలు, ఫిర్యాదుల సంగతి పక్కనపెడితే.. 12 శాతం కొత్త ఓట్లు అంటే ఎన్నికల ఫలితాన్నే ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి అధికారులు అప్రమత్తమయ్యారు. మునుగోడు ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు ఈనెల 14న చివరి తేదీ కాగా.. అప్పటి వరకూ కొత్త ఓటుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 14న మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రకటిస్తారు.