రాష్ట్రమంతటా మునుగోడు ఫార్ములా.. ఎమ్మెల్యేలకు కీలక బాధ్యతలు
2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కనీసం 100 నుంచి 105 సీట్లు గెలవాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో 90 సీట్ల వరకు గెలుస్తామని ప్రకటించారు.
తెలంగాణలో హ్యాట్రిక్ విజయం సాధించి మరోసారి అధికారంలోకి రావాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా సీఎం కేసీఆర్ వ్యూహలు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీకీ ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ఓటర్లను మరోసారి తమవైపు తిప్పుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఇంచార్జులకు కీలకమైన బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తుంది. మునుగోడులో అనుసరిస్తున్న ఫార్ములానే రాష్ట్రమంతటా అమలు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా ప్రతీ గ్రామంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన కీలక నాయకులు టీఆర్ఎస్‌లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. కనీసం 50 ఓట్లు వేయించే సామర్థ్యం ఉన్న గ్రామస్థాయి నాయకులే టార్గెట్‌గా పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంచార్జులకే ఈ బాధ్యతలు అప్పగించారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కనీసం 100 నుంచి 105 సీట్లు గెలవాలని సీఎం కేసీఆర్ లక్ష్యంగా పెట్టారు. ఇటీవల జరిగిన టీఆర్ఎస్‌ఎల్పీ సమావేశంలో 90 సీట్ల వరకు గెలుస్తామని ప్రకటించారు. అయితే మరిన్ని సీట్లు పార్టీ ఖాతాలో పడాలంటే తప్పకుండా మరింత కష్టపడాలని సూచించారు. ఇటీవల పలు నియోజకవర్గాలో పార్టీ గ్రాఫ్ పడిపోతుందని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను ప్రోత్సహించి పార్టీలో చేర్పించాలని కేసీఆర్ చెబుతున్నారు. రాష్ట్రంలో పార్టీకి భారీ సభ్యత్వాలు ఉన్నాయి. ఏ పార్టీకీ లేనంత సభ్యులు టీఆర్ఎస్‌కు ఉన్నారని, ఇదొక రికార్డు అని పార్టీ నాయకుల చెప్తున్నారు. సభ్యత్వాలు అయితే ఉన్నాయి కానీ.. వాళ్లందరూ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. అందుకే కొత్త సభ్యులను చేర్పించడం, గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేయడం ముఖ్యమని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
మునుగోడులో ఇతర పార్టీలకు చెందిన బలమైన కార్యకర్తలను ఇప్పటికే టీఆర్ఎస్‌లో చేర్పించారు. ఇలా చేయడం వల్ల ప్రతిపక్ష పార్టీలు నైతికంగా దెబ్బతింటాయి. కొత్తగా మరో వ్యక్తిని నాయకుడిగా తయారు చేయడానికి సమయం కూడా పడుతుంది. కాబట్టి ఈ ఫార్ములా తప్పకుండా వర్క్అవుట్ అవుతుందని కేసీఆర్ నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో పని చేసేది ఇలాంటి కార్యకర్తలే, ఓట్లు వేయించేది వీళ్లే.. కాబట్టి ఎమ్మెల్యేలు ప్రతీ గ్రామంలో చేరికలను ప్రోత్సహించాలని కోరుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే పార్టీలో కీలకం వ్యవహరిస్తున్న కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కేసీఆర్ చెబున్నారు. ఈ ఫార్ములా సత్ఫలితాలు ఇస్తే మూడో సారి అధికారంలోకి రావడం పెద్దగా కష్టం కాదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.