Telugu Global
Telangana

మునుగోడు రైతులకు కొత్త కష్టం.. కూలీలు లేక వ్యవసాయ పనులు ఆలస్యం..

మునుగోడులో వ్యవసాయ సీజన్ ని, ఎలక్షన్ సీజన్ కమ్మేసింది. రైతులకు కూలీలను దూరం చేసింది, వ్యవసాయ పనులను ఆలస్యం చేస్తోంది.

మునుగోడు రైతులకు కొత్త కష్టం.. కూలీలు లేక వ్యవసాయ పనులు ఆలస్యం..
X

మునుగోడుకి ఉప ఎన్నిక ఎందుకొచ్చిందో అందరికీ తెలుసు. ఆ 18వేల కోట్ల వ్యవహారం కాస్తా ఇప్పుడు రైతులకు కొత్త కష్టం తెచ్చిపెట్టింది. సాధారణంగా ఈ సీజన్లో వరికోత, పత్తి తీత పనులు జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడా కూలీలు అందుబాటులో లేరు. వ్యవసాయ కూలీగా మధ్యాహ్నం వరకు కష్టపడితే వచ్చేది 400 రూపాయలు, పార్టీ జెండా పట్టుకుని కాసేపు రోడ్ షో లో నడిస్తే వచ్చేది 500 రూపాయలు. అందుకే వ్యవసాయ సీజన్ ని, ఎలక్షన్ సీజన్ కమ్మేసింది. రైతులకు కూలీలను దూరం చేసింది, వ్యవసాయ పనులను ఆలస్యం చేస్తోంది.

వ్యవసాయ పనులు జోరుగా సాగే ఈ టైమ్ లో, మధ్యాహ్నం వేళ గ్రామాలన్నీ బోసిపోయినట్టుగా ఉండేవి. చిన్నా పెద్దా అందరూ పొలంబాట పడతారు కాబట్టి, ఏ గ్రామంలోకి వెళ్లినా వృద్ధులు తప్ప ఇంకెవరూ కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు ఏ గ్రామంలోకి వెళ్లినా కారు రివర్స్ చేసుకోడానికి కష్టపడేంతగా రద్దీ పెరిగింది. ఊరు ఊరంతా కార్లే కనపడుతున్న పరిస్థితి. 2023 సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఇది కర్టన్ రైజర్ అన్న‌ట్టుగా ప్రచారం జరగడంతో మూడు పార్టీలు ఎక్కడా తగ్గేది లేదంటున్నాయి. ప్రచారం ముమ్మరం చేశాయి.

ఫలితాలు వచ్చే వరకు..

మునుగోడులో నవంబర్ -3 ఎలక్షన్. నవంబర్ -6 లెక్కింపు, ఫలితాలు. అంటే మరో రెండు వారాలపాటు అక్కడ ఎన్నికల హడావిడే కనిపిస్తుంది. గ్రామంలో చోటామోటా నాయకులకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్క ఓటు కూడా చాలా విలవైనదని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. అందుకే మునుగోడులో నాయకులు మకాం వేసి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రచారంలో మునిగిపోతున్నారు. మునుగోడు ఫలితాలు వచ్చే వరకు నియోజకవర్గంలో తెల్లచొక్కాల హడావిడి కనిపిస్తుంది. అప్పటి వరకు వ్యవసాయ పనులకు కూలీలు కరువేనని తెలుస్తోంది.

First Published:  18 Oct 2022 7:02 AM IST
Next Story