Telugu Global
Telangana

మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమని ప్రచారం చేస్తారు?

మునుగోడులో ఇప్పటికే రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రచారం మొదలుపెట్టారు. కానీ వెంకటరెడ్డి ఇంత వరకు వెళ్లలేదు. కాగా, ప్రచారంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో వెంకటరెడ్డి సందిగ్దంలో ఉన్నారు.

మునుగోడులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమని ప్రచారం చేస్తారు?
X

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. టీఆర్ఎస్‌ను ఇరుకున పెట్టడానికి బీజేపీ వేసిన ఎత్తులో తాము పావుగా మారిపోయామని పార్టీ నేతలు బాధపడుతున్నారు. జాతీయ నాయకత్వం విషయంలో పార్టీ ఇబ్బందులు పడుతుండటం, రాష్ట్రంలో గ్రూపులు కట్టి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న సమయంలో ఉప ఎన్నిక రావడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉపఎన్నిక అంటూ వచ్చాక ఇక బరిలోకి దిగక తప్పదు కాబట్టి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు రంగంలోకి దిగారు. ఇదిలా ఉంటే.. తమ్ముడి రాజీనామా కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో ఎలా వ్యవహరించాలో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చుకోలేకపోతున్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ అయిన వెంకటరెడ్డి.. తప్పకుండా ప్ర‌చారం చేయాలి. స్టార్ క్యాంపెయినర్ హోదా పెట్టుకొని ఇంటికే పరిమితం అయితే బాగోదు. కానీ అవతల ప్రత్యర్థి స్వయంగా తమ్ముడే. పైగా నిన్నటి వరకు కాంగ్రెస్‌లో ఉన్నోడే. దీంతో ఉపఎన్నిక ప్రచారానికి పోయి ఏం చేయాలనే డైలమాలో వెంకటరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొదట్లో మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి తనను ఎవరూ పిలవలేదని అలిగిన వెంకటరెడ్డి.. ఆ తర్వాత రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేశారు. అయితే అధిష్టానంతో చర్చల అనంతరం మునుగోడు ప్రచారానికి వస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గతవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కూడా భేటీ అయ్యారు.

మునుగోడులో ఇప్పటికే రేవంత్ రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు ప్రచారం మొదలుపెట్టారు. కానీ వెంకటరెడ్డి ఇంత వరకు వెళ్లలేదు. కాగా, ప్రచారంలో ఎలా వ్యవహరించాలనే విషయంలో వెంకటరెడ్డి సందిగ్దంలో ఉన్నారు. బీజేపీ, టీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం వరకు ఓకే.. కానీ బీజేపీ అభ్యర్థి అయిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎలా వ్యవహరించాలనే విషయంలోనే మథన పడుతున్నట్లు తెలుస్తోంది. తమ్ముడిపై నేరుగా విమర్శలు చేయలేరు. గతంలో ప్రాతినిథ్యం వహించిన కాంగ్రెస్ పార్టీని కూడా ఏమీ అనలేరు. మరి ఎలా ప్రచారం కొనసాగించాలని సన్నిహితుల దగ్గర వాపోయారని తెలుస్తోంది.

వ్యాపార అవసరాల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి, ఉపఎన్నిక తీసుకొచ్చారని.. ఆయన అసలు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆ ఆరోపణలను ఖండిచలేదు. అదే సమయంలో ఓన్ చేసుకోలేదు. అలా చేస్తే.. పార్టీతో పాటు వెంకటరెడ్డికి కూడా ఆ వ్యాఖ్యలు చుట్టుకుంటాయి. దీంతో మునుగోడు ప్రచారం విషయం ఇప్పుడు వెంకటరెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. ఇలాంటి సందిగ్ద పరిస్థితుల్లో స్టార్ క్యాంపెయినర్ వెంకట‌రెడ్డి ప్రచారం ఎలా ఉండబోతుందో అనే ఆసక్తి నెలకొంది.

వెంకటరెడ్డి ప్రచారానికి వస్తే గతంలో మాదిరిగానే కేవలం కేసీఆర్, టీఆర్ఎస్, మోడీని టార్గెట్ చేస్తే మంచిదని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి విషయాన్ని పక్కన పెట్టి.. మిగతా విషయాలపై వెంకటరెడ్డి దృష్టి పెడితే సరిపోతుందని కాంగ్రెస్ నాయకులు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. స్టార్ క్యాంపెయినర్‌గా ముందుండి నడిపిస్తే చాలని.. మిగతా విషయాలు తాము చూసుకుంటామని సీనియర్లు కూడా భరోసా ఇచ్చినట్లు సమాచారం. సలహాలు, సూచనల వరకు బాగానే ఉన్నా.. వెంకటరెడ్డి బరిలోకి దిగిన తర్వాత ఎలా ఉంటుందో వేచి చూడాలి.

First Published:  29 Aug 2022 1:24 PM IST
Next Story