మునుగోడు ఉప ఎన్నిక: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఓట్లపై గట్టి నమ్మకంతో టీఆర్‌ఎస్
టీఆరెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల మునుగోడు నియోజకవర్గంలో మూడు లక్షలకు పైగా ప్రజలు లబ్ధిపొందుతున్నారు. రేపు జరగబోయే ఉప ఎన్నికలో వాళ్ళే తమను గెలిపిస్తారని టీఆరెస్ నమ్మకంగా ఉంది.
మునుగోడు ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే విషయం ఇంకా తేలకపోయినప్పటికీ ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు రాజకీయ వేడి గాలి వీస్తోంది. టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీలు గెలుపే లక్ష్యంగా ఎత్తులు పైఎత్తులు అప్పుడే మొదలుపెట్టాయి. ఒక పార్టీలోంచి మరో పార్టీలోకి జంపింగులు మొదలయ్యాయి. ఓ పార్టీ అయితే ఏంపీపీకింత, ఎంపీటీసీకింత, సర్పంచ్ కు ఇంత అంటూ రేట్లు కట్టి మరీ కొనుగోళ్ళు మొదలుపెట్టింది. అందుకోసం ఆ పార్టీ ప్రత్యేకంగా చేరికల కమిటీ ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో గెలుపుపై ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు.గతంలో తామే గెలిచాం కాబట్టి ఈ సారి కూడా గెలుపు తమదే అన్న నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ ఉండగా, గతంలో కాంగ్రెస్ తరపున గెల్చిన కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తమ పార్టీ తరపున నిలబడుతున్నాడు కాబట్టి గెలుపు తమదే అనిబీజేపీ భావిస్తోంది. పైగా ప్రధాని మోడీ ప్రభావం కూడా యువతపై ఎక్కువగా ఉంటుందనే నమ్మకంతో ఉంది బీజేపీ.
ఎవరు ఏ నమ్మకంతో ఉన్నా టీఆరెస్ తాను ఎనిమిదేళ్ళలో చేసిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై నమ్మకంతో ముందుకు పోతోంది. తాము ఈ ఎనిమిదేళ్ళలో చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల మునుగోడు నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ప్రజలు లబ్ధి పొందారని, వాళ్ళందరి ఓట్లు తమకే అన్న నమ్మకంతో ఉంది టీఆరెస్. ఒక్క సారి ఈ అంశంపై దృష్టి సారిస్తే టీఆరెస్ చెప్తున్న లెక్కల్లో వాస్తవాలు తెలుస్తాయి.
ప్రభుత్వ లెక్కల ప్రకారం టీఆర్‌ఎస్ ప్రభుత్వం 2014 నుంచి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల మునుగోడులో దాదాపు 3,34,994 మంది లబ్ధిదారులు లబ్ధి పొందారు. వారిపై 10,260 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం.
2014 నుండి 2022 వరకు, ఆసరా పింఛన్లు, పంట రుణాల మాఫీ, రైతు బంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, దళిత బంధు, వరి సేకరణ కార్యక్రమాలు, వడ్డీ లేని రుణాలు, మునుగోడు నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ తదితర లబ్ధిదారుల వివరాలన్నీ టీఆరెస్ పార్టీ సేకరించింది.
మునుగోడు ఉపఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంధన శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ''గత ఎనిమిది సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల ఆధారంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు లక్షల మంది లబ్ధిదారులకు సుమారు రూ. 10,260 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు పేదలను ఆదుకోవడంలో ఎంత శ్రద్ధ, అంకితభావంతో ఉందో ఈ విషయమే తెలియజేస్తోంది.'' అన్నారు.
దళారుల అక్రమాలకు ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలను అందజేయడమే కాక లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ చేశాం. అలా లబ్ధిపొందినందుకు ప్రజలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతగా మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలని కోరతున్నామని మంత్రి అన్నారు.
మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఖర్చు చేసిన నిధుల వివరాలను పార్టీ విడుదల చేస్తుందని జగదీశ్ రెడ్డి తెలిపారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు కాంగ్రెస్‌ను గెలిపించినందుకే మునుగోడు సీటులో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసిందని రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని జగదీశ్‌రెడ్డి ఖండించారు.
మునుగోడుకు 2014 నుంచి 2018 వరకు టీఆర్‌ఎస్ ప్రాతినిధ్యం వహించినప్పుడు అక్కడి ప్రజల కోసం ఎంత చేశామో, 2018 నుంచి 2022 మధ్య కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించినప్పుడు అంతకన్నా ఎక్కువే చేశాం. 2018 నుంచి 2022 మధ్య కూడా మా సంక్షేమ పథకాల ద్వారా మూడు లక్షలకు పైగా ప్రజలు లబ్ధి పోందారు అని జగదీష్ రెడ్డి చెప్పారు. ఒక్క సారి అధికారిక డేటా చూస్తేరాజ్‌గోపాల్‌రెడ్డి తప్పుడు వాదనలను బట్టబయలు చేస్తాయి'' అని జగదీశ్‌రెడ్డి అన్నారు.
మునుగోడు ఓటర్లు ఒక వేళ తమకు జరిగిన అభివృద్ది , తమకు అందిన సంక్షేమ పథకాల ఆధారంగానే ఓటు వేస్తే టీఆరెస్ భావిస్తున్నట్టు ఆ పార్టీ గెలుపు నల్లేరు మీద బండి నడకే.