ఇదేనా చంద్రబాబు అసలు సమస్య?
పొత్తు పెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న కారణంగా బీజేపీని ఏమీ అనలేరు. ఇదే సమయంలో ఓటుకునోటు కేసు తదితరాల కారణంగా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనలేరు. పైగా చంద్రబాబు ప్రచారం చేస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు తెరపైకి వస్తుంది.
మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నిక చంద్రబాబు నాయుడుకు పెద్ద సమస్యగా మారింది. తెలంగాణాలోని పార్టీ నేతలంతా మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాల్సిందే అని ఎప్పటి నుండో ఒత్తిడి తెస్తున్నారు. చంద్రబాబు మాత్రం ఏ నిర్ణయం తీసుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. లోపలేమో చంద్రబాబుకు కూడా మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాలనే ఉంది. కానీ పోటీ చేస్తే దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలాగుంటాయో అన్నదే అర్ధంకాక అవస్థలు పడుతున్నారు.
మునుగోడులోని 2.5 లక్షల ఓటర్లలో సుమారు 60 శాతం బీసీ ఓటర్లే. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల అభ్యర్ధులు రెడ్డి సామాజికవర్గం నేతలే. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని ఒక బీసీ నేతను ఎన్నికలోకి దింపాలని నేతలందరు చంద్రబాబుకు ఇప్పటికి మూడు సమావేశాల్లో స్పష్టంగా చెప్పారు. నియోజకవర్గం ఇన్‌చార్జి ఐలయ్య యాదవ్ పోటీకి రెడీగా ఉన్నారు. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం నామినేషన్ వేయటానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
అయితే ఐలయ్య నామినేషన్ వేసినంత తేలిక కాదు తర్వాత పరిణామాలను ఎదుర్కోవటం. సమస్య ఏమిటంటే నామినేషన్ వేసిన తర్వాత టీడీపీకి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అన్నీపార్టీలు ప్రత్యర్ధి పార్టీలే అవుతాయి. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్ధి పార్టీపై ఆరోపణలు, విమర్శలు చేయక తప్పదు. కాంగ్రెస్ సంగతి ఎలాగున్నా టీఆర్ఎస్, బీజేపీని టార్గెట్ చేయాల్సిందే. ఒకసారి పోటీలోకి టీడీపీ దిగితే చంద్రబాబు కూడా ప్రచారంలోకి దూకాల్సిందే. రోడ్డు షోలు, బహిరంగ సభల్లో పాల్గొనక తప్పదు.
లోకల్ నేతల సంగతి ఎలాగున్నా చంద్రబాబు కచ్చితంగా అన్నీ పార్టీలను టార్గెట్ చేయాల్సిందే. టీఆర్ఎస్, బీజేపీలను టార్గెట్ చేయటమంటేనే చంద్రబాబుకు చాలా ఇబ్బందిగా మారుతుంది. పొత్తు పెట్టుకోవాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తున్న కారణంగా బీజేపీని ఏమీ అనలేరు. ఇదే సమయంలో ఓటుకునోటు కేసు తదితరాల కారణంగా కేసీఆర్‌ను పల్లెత్తు మాట అనలేరు. పైగా చంద్రబాబు ప్రచారం చేస్తే మళ్ళీ తెలంగాణ సెంటిమెంటు తెరపైకి వస్తుంది. అప్పుడు టీడీపీకి ఎన్ని ఓట్లొస్తాయో తెలీదు. గౌరవప్రదమైన ఓట్లొస్తే వేరేసంగతి. డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోతే అదింకా అవమానం. ఈ సమస్యల వల్లే చంద్రబాబు ఏమీ తేల్చుకోలేకపోతున్నారు.