Telugu Global
Telangana

మునుగోడు సెమీఫైనల్ అవుతుందా ?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక అక్కడ రాజకీయ బలాబలాలు, సామాజిక సమీకరణలపై రకరకాల చర్చలు, ఊహాగానాలు, అంతూ పొంతూ లేని కథనాలు, సర్వేలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

X

మునుగోడు ఉపఎన్నిక 2023 లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అవుతుందని కొందరు, కేసీఆర్ పరిపాలనకు రెఫరెండం అవుతుందని కొందరు అప్పుడే వాదనలు ప్రారంభించారు. అసలు అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందుగానే కేసీఆర్ వెళ్లే అవకాశాలున్నట్టు కొన్ని మీడియా సంస్థలు కథనాలు వండి వార్చుతుండడం పరాకాష్ట ! హుజూరాబాద్ ఉప ఎన్నిక కొన్ని పరిణామాల వలన అనివార్యమైంది. మునుగోడుకు ముంచుకు రానున్న ఎన్నిక బీజేపీ ఏరి కోరి తెచ్చుకుంటోంది. టిఆర్ఎస్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెనుసవాలు విసరడానికి ఉపఎన్నిక ఎత్తుగడను ఆ పార్టీ ఎంచుకున్నది. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నందున మునుగోడు నియోజకవర్గంలో అభివృద్ధి జరగనందుకు గాను శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రకటన కన్విన్సింగ్ గా లేదు. ఆ ప్రకటన తాజాగా జరుగుతున్న సన్నివేశాలకు అతకని విధంగా ఉన్నది. సరే, ఆయన రాజీనామాతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఇక అక్కడ రాజకీయ బలాబలాలు, సామాజిక సమీకరణలపై రకరకాల చర్చలు, ఊహాగానాలు, అంతూ పొంతూ లేని కథనాలు, సర్వేలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ రాజకీయ వాతావరణం పొడిగా లేని మాట నిజమే! కొన్నినెలలుగా తెలియని అలజడి ఉన్నది. బీజేపీ ఏర్పరచిన కృత్రిమ అల్పపీడనం కనిపిస్తూనే ఉన్నది. బండి సంజయ్ వంటి వారి అగ్నికి ఆజ్యంలా ఈటల రాజేందర్ తోడయ్యారు. బీజేపీ నాయకులు తమ ఎజండాను బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యంగా చెబుతున్నారు. టిఆర్ఎస్ లో అసమ్మతి బాంబు పేలబోతున్నట్టు, ఆ పార్టీలో భూకంపం రానున్నట్టు అమిత్ షా నుంచి ఈటల రాజేందర్ వరకు అందరూ అంటున్న మాటే ! ఇందులో నిజానిజాలు ఎవరికీ అవసరం లేదు. బీజేపీ ఏమి చెప్పినా గుడ్డెద్దు చేలో పడ్డట్టు నమ్మేవాళ్ళు ఉన్నారు. బీజేపీ ట్రాప్ లో పడేవాళ్ళూ ఉన్నారు. ఇలాంటి మాయోపాయాలలో బీజేపీ దిట్ట.

ఆధిక్యతా ప్రదర్శన కావచ్చు, అహంకారం కావచ్చు, అలవికాని ఇగో కావచ్చు, కలతలు కావచ్చు, కలహాలు కావచ్చు.. మొత్తమ్మీద 'అంతర్యుద్ధం'తో కాంగ్రెస్ పార్టీ చితికిపోతున్నది. నానాటికీ బలహీన పడిపోతోంది. పార్టీ నాయకులకే తమ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతోంది. 2018 ఎన్నికల్లో గెలిచినా వారిలో 12 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కు బదిలీ అయ్యారు. అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజాగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు విడాకులు ఇచ్చారు. ఏఐసిసి అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్ ను పార్టీ కోల్పోయింది. నవంబర్ 5 న ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేల్చనున్న `బాంబు` ఏమిటో తెలియదు. సీఎల్పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క కూడా ''నేను కాంగ్రెస్ విడిచిపెట్టి పోవడం లేదు'' అని సంజాయిషీ ఇచ్చుకోవలసి వస్తోంది.

రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితులు చక్కబడకపోగా మరింతగా ముదురుతున్నాయి. ఇందుకు కారణాలు అనేకం. పూర్వాశ్రమం తెలుగుదేశం పార్టీ ఆయనను వెంటాడుతూనే ఉన్నది. ఆయనకు తెలంగాణ వాదంతో, తెలంగాణ ఉద్యమంతో సంబంధాలు లేవు. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడు. జైలులో గడిపి వచ్చిన అనుభవం. కాంగ్రెస్ లో చేరిన నాలుగేండ్ల లోపే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి సునాయాసంగా రాదని సులభంగా ఎవరికయినా అర్ధవుతుంది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించినట్టుగా ఢిల్లీలోని పార్టీ హైకమాండ్ కు డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కున్నారేమో ! లేదా కర్ణాటక నాయకుడు డీకే.శివకుమార్ తదితరుల ద్వారా జరిపిన లాబీయింగ్ ఫలితం వలన టీపీసీసీ సారథ్యం లభించిందేమో ! తెలియదు. తాను ఆశించిన పదవి రానందుకు, అదే పదవి రేవంత్ కు వచ్చినందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ధర్మాగ్రహమే !! అయితే పార్టీలో కనీసం నాలుగేండ్లుగా కొనసాగుతున్న అభద్రత వాతావరణాన్ని తొలగించడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారు. కేసీఆర్ ను దూషించడంలో రేవంత్ రెడ్డి వాగ్దాటి రాహుల్ గాంధీ కోటరీకి చెందిన కేసి.వేణుగోపాల్, మాణిక్యం ఠాగూర్ వంటి వారికి నచ్చి ఉండవచ్చు కానీ కాంగ్రెస్ పాత కాపులకు నచ్చడం లేదు. మింగుడుపడడం లేదు. అందుకే రేవంత్ ను సహించడం లేదు.

''ఓకే హోమ్ గార్డు 34 సంవత్సారాలుగా ఎదుగూ బొదుగూ లేకుండా పనిచేస్తుంటాడు. కానీ సివిల్స్ రాసి పాసయిన వ్యక్తి నేరుగా జిల్లా ఎస్పీగా వచ్చి కూర్చుంటాడు. నేను ఇంతకాలం సర్వీసులో ఉన్నా.. నేనెందుకు ఎస్పీ కాకూడదు అని అనుకుంటే ఎలా? ఎవరి సామర్థ్యాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో పదవులు లభిస్తుంటాయి''అని తనకు పిసిసి అధ్యక్ష పదవి రావడాన్ని సమర్ధించుకుంటూ రేవంత్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి కోణంలో ఆయన వ్యాఖ్యలను తిరస్కరించలేం. పార్టీ హైకమాండ్ ను ఒప్పించడంలోనూ, పకడ్బందీగా లాబీయింగ్ చేయడంలోనూ మిగతా వాళ్ళు వెనుకబడితే రేవంత్ తప్పెట్లా కాగలదు. బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం. కానీ ఆ తర్వాత ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడం, తన చుట్టూ ఒక 'కోటరీ' ని పెట్టుకొని వ్యవహారాలూ నడుపుతుండడం విమర్శలపాలవుతోంది. ఆ కోటరీ మాఫియా వలె పనిచేస్తున్నదంటూ బీజేపీలోకి చేరేముందు దాసోజు శ్రవణ్ అన్నారు. కాంగ్రెస్ లో నెలకొన్న ఈ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకోవడానికి సంబంధించి అందివచ్చిన అన్ని అవకాశాలనూ బీజేపీ ఉపయోగించుకుంటోంది.

మునుగోడు ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. వివిధ రాజకీయ పార్టీలు తమ అభ్యర్థిపై కసరత్తు జరుపుతున్నాయి. నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్, డిసెంబర్‌లో గుజరాత్ ఎన్నికలు జరగనున్నందున మునుగోడుకు కూడా నవంబర్‌లో ఎన్నిక జరిగే అవకాశాలున్నవి.

ఈనెల 21 చౌటుప్పల్‌లో భారీ సభకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్‌ చేదు అనుభవంతో మంత్రి జగదీశ్‌రెడ్డి కొన్నినెలలగా మునుగోడుపైనే దృష్టి కేంద్రీకరించారు. రాజీనామా చేయడానికి ముందు నుంచే రాజగోపాల్‌రెడ్డి ఉప ఎన్నిక ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. మంగళవారం నాటికి అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్‌ శ్రేణులలో అయోమయం నెలకొని ఉంది. తమ పార్టీ అభ్యర్థిగా ఎవరిని ఖరారు చేస్తారన్న అంశంపైన కాంగ్రెస్ క్యాడర్ ఒక నిర్ణయానికి రావచ్చు. రాజగోపాల్ రెడ్డిని ఢీ కొనడానికి సంపన్నుడే కావాలని రేవంత్ రెడ్డి పట్టు బడుతున్నారు. హైదరాబాద్ లో స్థిరపడిన సంస్థాన్ నారాయణపూర్ కుచెందిన కాంట్రాక్టర్ చల్లమల్ల కృష్ణారెడ్డి ఆకస్మికంగా తెరపైకి వచ్చారు. రేవంత్ చండూరు సభ ఏర్పాట్లన్నీ ఆయనే చేశారు. ఇందుకు గాను కనీసం 2 కోట్లు కృష్ణారెడ్డి ఖర్చుపెట్టి ఉంటారని మునుగోడు సెగ్మెంటులో ప్రచారం జరుగుతోంది.

ఇక చౌటుప్పల్ లో రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ బలప్రదర్శన జరిపే నాటికి కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరైనా 'నూతన తార'లు ప్రత్యక్షమవుతారేమో చూడాలి. రాజగోపాల్‌ రెడ్డితోనే కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళతాయని కొందరు చేసిన ఊహాగానాలకు చండూరు సభతో తెరపడినట్లయింది. ''ఉప ఎన్నికలో గెలుపు కోసం ఊరూరా తిరుగుతా. ప్రతీ యువకుడిని కలుస్తా'' అని రేవంత్‌ చెప్పారు. ఆర్థికంగా, సామాజికంగా బలమైన అభ్యర్థి అందుబాటులోకి రావడం కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్‌కు ఊరటనిచ్చింది. ఐదుగురు సభ్యులతో కూడిన వ్యూహ, ప్రచార కమిటీ ఆ నియోజకవర్గంలో మకాం వేయబోతోంది.''నాకు సూర్యాపేట ఎంతో మునుగోడు కూడా అంతే.. రెండూ సమానమే '' అని మంత్రి జగదీశ్ రెడ్డి చెబుతున్నారు. మునుగోడులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వ్యవహారాలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ, దళితబంధు పథకం ప్రచారం వంటి కార్యక్రమాలకు మంత్రి రెగ్యులర్ గా హాజరవుతున్నారు.

అధికార పార్టీలో పోటీ తీవ్రంగానే ఉన్నది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి, మరికొందరు టిఆర్ఎస్ నాయకులకు మధ్య పొసగడం లేదు. వివిధ కారణాల వల్ల ప్రగతి భవన్ నుంచి దూరం పెట్టిన మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ టికెట్టు ఆశిస్తున్నారు. పైగా తనకే టికెట్టు వస్తుందని కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మునుగోడులో బీసీ సామాజికవర్గం ఓటుబ్యాంకు బలంగా ఉన్నప్పటికీ ఇప్పటివరకు రెడ్డి లేదా నాన్ బిసి అభ్యర్థులే గెలుస్తూ ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం ప్రభావశీలంగా ఉండడంతో అటువైపే కేసీఆర్, కేటీఆర్ మొగ్గు జూపే అవకాశాలున్నవి. చిట్టచివరకు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికే టికెట్టు వరించవచ్చునన్న ప్రచారం సాగుతోంది. 2018 లో ఓడిపోయినా నాటి నుంచి కూడా కూసుకుంట్ల నియోజకవర్గాన్ని పట్టుకొని ఉండడం సానుకూల అంశం. ఆయనపై సానుభూతి అదనపు బలం.

నియోజకవర్గంలో గ్రూపు తగాదాలను దారికి తెచ్చేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అన్ని మండలాల అధ్యక్షులు, కీలక ప్రజాప్రతినిధులతో మంత్రి నేరుగా సంబంధాలు ఏర్పరుచుకొని కాంగ్రెస్‌ నుంచి పెద్ద సంఖ్యలో వలసలను ప్రోత్సహించారు. ఒక వైపు ప్రభుత్వ యంత్రాంగం, మరో వైపు పార్టీ వ్యవస్థను ఆయన తన నియంత్రణలోకి తీసుకున్నారు. అక్కడ పేరుకే కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అయినా, వ్యవహారమంతా అధికార టీఆర్‌ఎస్ దే అనే వాతావరణం దాదాపు నాలుగేండ్లుగా సాగుతోంది. రాజగోపాల్‌రెడ్డి పలు వేదికలపై మంత్రి జగదీశ్‌ రెడ్డితో ఘర్షణపూరిత వైఖరిని ప్రదర్శించారు.

కాగా ఇతర పార్టీల బలాబలాలు, అభ్యర్థి ఎవరైతే మంచిది, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు ఎవరు, వారి బలాలు, బలహీనతలపై ముమ్మరంగా సర్వేలు జరుగుతున్నాయి.

First Published:  9 Aug 2022 6:31 AM GMT
Next Story