మునుగోడు ఉప ఎన్నికల హామీ.. ఇలా నెరవేరుతోంది
ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ సూచనలతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు మంత్రి హరీష్ రావు. మర్రిగూడకు 30 పడకల ఆస్పత్రి మంజూరు చేశామని తెలిపారు.
ఆమధ్య మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నియోజకవర్గానికి ప్రత్యేక హామీలిచ్చారు సీఎం కేసీఆర్. వాటిని ఇప్పుడు అమలులో పెట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో 100 పడకల ఆస్పత్రికి మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీల్లో భాగంగా చౌటుప్పల్ లో రూ.36కోట్లతో ఆస్పత్రి నిర్మించబోతున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో రూ.1300కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ సూచనలతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. మర్రిగూడకు 30 పడకల ఆస్పత్రి మంజూరు చేశామని, తంగేడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రూ.90లక్షలు కేటాయించామని తెలిపారు.
Hon‘ble Ministers Shri @BRSHarish Garu and @jagadishBRS Garu Laid foundation stone for 100 bedded Govt Hospital at Choutuppal of Munugode Assembly Constituency. pic.twitter.com/JqdZfVs8wz
— Office of Minister for Health, Telangana (@TelanganaHealth) April 18, 2023
కేంద్ర ప్రభుత్వం బీబీనగర్‌లో ఎయిమ్స్ ప్రారంభించినా అక్కడ వసతులు లేవని, కేవలం ఓపీ సేవలే అందిస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. తెలంగాణ ఏర్పాటు కాకముందు రాష్ట్రంలో కేవలం 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 100కు చేరుకుందని చెప్పారు. కిడ్నీ రోగులకు డయాలసిస్ సేవలతో పాటు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నామన్నారు.
నిరుపేదల వద్దకే వైద్యం వెళ్లాలనే ఉద్దేశంతో పల్లె దవాఖానాలను ప్రారంభించామని చెప్పారు మంత్రి హరీష్ రావు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో గతంలో 30 శాతం మాత్రమే ప్రసవాలు జరిగేవని, తెలంగాణ ఏర్పడ్డాక వైద్య సేవలు మరింత మెరుగుపడటం, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో 68 శాతం గర్భిణులు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకే వస్తున్నారని చెప్పారు. గతంలో ఎంబీబీఎస్ చదవాలంటే విద్యార్థులు ఉక్రెయిన్, ఫిలిఫ్పీన్స్ వంటి దేశాలకు వెళ్లేవారని, తెలంగాణలో 35 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంతో బయటికి వెళ్లకుండా స్వరాష్ట్రంలోనే వైద్యవిద్యను పూర్తి చేస్తున్నారని చెప్పారు.