నవంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక
మునుగోడు ఉపఎన్నిక నగారా మోగింది. మునుగోడు ఉపఎన్నికకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 14 కాగా ఉపసంహరణకు గడువు 17 వ తేదీ. ఎన్నిక నవంబర్ 3వ తేదీన జరుగుతుంది. 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికకు సోమవారంనాడు షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 7 వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 14 కాగా ఉపసంహరణకు గడువు 17 వ తేదీ. ఎన్నిక నవంబర్ 3వ తేదీన జరుగుతుంది. 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు.
2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి పార్టీ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఈ ఎన్నిక అనివార్యమయ్యింది. బిజెపి తరపున ఆయనే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే రాజగోపాల రెడ్డి తరపున హోంమంత్రి అమిత్ షా తదితర బిజెపి జాతీయ నాయకులు కూడా వచ్చి ప్రచారం చేసి వెళ్ళారు. ఎలాగైనా మునుగోడు లో గెలిచి తమ సత్తా చాటాలని బిజెపి ఉవ్విళ్ళూరుతోంది. వ్యక్తిగతంగా కూడా ఇక్కడ గెలవడం రాజగోపాల రెడ్డికి కూడా ప్రతిష్ఠాత్మకమే.
ఇక కాంగ్రెస్ తరపున కాంగ్రెస్ దివంగత నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి రెడ్డికి టిక్కెట్టు ప్రకటించారు. ఆమె కూడా ఇప్పటికే ప్రచారంలో దిగారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క, మధు యాష్కీ, ఉత్తమ కుమార్ రెడ్డి, తదితరులు ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ఓటర్లను కాళ్ళు పట్టుకుని అయినా ఓట్లు అడగాలని పిసిసి అధ్యక్షుడు ఒక కార్యక్రమాన్ని ప్రకటించారు. గత ఎన్నికల్లో గెలిచిన సీటును నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యావశ్యకం. అంతేగాక పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ పనితీరుకు కూడా ఇది ఒక పరీక్ష వంటిదే.
ఇక తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) తరపున అధికారికంగా అభ్యర్ధి పేరును ప్రకటించలేదు. అయితే కూసుకుంట్ల ప్రభాకర రెడ్డికే టికెట్టు ఖాయమైందని చెబుతున్నారు. ఆయన ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు. ముగుగోడులో గెలుపునకు వ్యూహాలు రచిస్తూ కార్యకర్తలను ఉత్సాహ పరుస్తున్నారు. ఈ సారి సీటును ఖాయంగా గెలుచుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది టిఆర్ఎస్.