Telugu Global
Telangana

మాణిక్యంకు మునుగోడు పరీక్ష ! ఫెయిలవుతారా? పాసవుతారా?

ఇప్పుడు మర్రి శశిధర్‌ రెడ్డి లాంటి నేతలు కూడా మాణిక్యంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో క‌ల్లోలానికి రేవంత్‌రెడ్డి, ఠాగూర్ కార‌ణ‌మ‌ని శ‌శిధ‌ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

మాణిక్యంకు మునుగోడు పరీక్ష ! ఫెయిలవుతారా? పాసవుతారా?
X

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌కు అసలు పరీక్ష మొదలైంది. మునుగోడు ఉప ఎన్నిక డూ ఆర్‌ డైగా మారింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికలను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ, మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా చేసిన సిట్టింగ్‌ సీటు కావడంతో మాణిక్యం పెద్ద సవాల్‌ ఎదుర్కొంటున్నారు.

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డికి మాణిక్యం మొదటి నుంచి మద్దతు ఇస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అలిగిన పట్టించుకోలేదని విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన పార్టీ వీడినప్పుడు మాణిక్యంపై కొందరు సీనియర్లు విమర్శలు చేశారు. ఇప్పుడు మర్రి శశిధర్‌ రెడ్డి లాంటి నేతలు కూడా మాణిక్యంపై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో క‌ల్లోలానికి రేవంత్‌రెడ్డి, ఠాగూర్ కార‌ణ‌మ‌ని శ‌శిధ‌ర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి పార్టీని న‌ష్టం క‌లిగించే ప‌నులు చేస్తున్నార‌ని, ఇంచార్జ్‌ ఠాగూర్.. రేవంత్‌కు ఏజెంట్‌గా ప‌నిచేస్తున్నార‌ని కూడా అన్నారు మ‌ర్రి శ‌శిధ‌ర్‌రెడ్డి.

ఈ టైమ్‌లో మునుగోడులో కాంగ్రెస్‌ గెలవాలి లేదా సెకండ్‌ ప్లేస్‌లోనైనా ఉండాలి. లేకపోతే మాణిక్యం ఠాగూర్‌కు సెగ మొదలవుతోంది. అందుకే మునుగోడుపై ఠాగూర్‌ పూర్తిగా ఫోకస్‌ పెట్టారు. గాంధీభవన్‌లో వరుస మీటింగ్‌లు పెడుతున్నారు. బుధవారం నిర్వహించిన మునుగోడు స్ట్రాటజీ కమిటీ మీటింగ్‌కు మధుయాష్కీ రాలేదు. దీంతో ఠాగూర్‌ అసహనం వ్యక్తం చేశారు. ఇటు మండలాల ఇంచార్జ్‌లు కూడా నియోజకవర్గానికి వెళ్లకపోవడంపై మండిపడ్డారు.

మొత్తానికి మునుగోడు సెగ ఠాగూర్‌ను పట్టుకుంది. ఈ ఉప ఎన్నికతో ఆయన ఇంచార్జ్‌ పదవి ఉంటుందా? ఊడుతుందా? అనేది తేలబోతోంది.

First Published:  17 Aug 2022 1:30 PM IST
Next Story