ఈటల దూకుడుతో బీజేపీలో కలకలం.. చేరికలపై గరం గరం..
ఈటల వ్యవహారంతో బండి సంజయ్ కూడా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. తాడూరి చేరిక విషయంలో సంజయ్ ఆమోదం కూడా లేదని, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారంలో ఈటల రాజేందర్ కాస్త దూకుడుగా వ్యవహరిస్తుండటంతో స్థానిక బీజేపీ నేతలు ఆయనపై రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. వాస్తవానికి మునుగోడు విషయంలో ఈటల వేలు పెట్టకూడదు. కానీ ఆయన రాష్ట్ర చేరికల కమిటీ కన్వీనర్ గా ఉండటంతో మునుగోడులో ఇతర పార్టీల నాయకులకు గాలమేస్తున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కి చెందిన చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డికి ఈటల బీజేపీ కండువా కప్పేశారు. తాడూరి చేరికతో పార్టీ బలపడేది లేదని, కేసులున్న అలాంటి వ్యక్తిని బీజేపీలోకి తీసుకు రావడం పార్టీకి నష్టమని అంటున్నారు స్థానిక నేతలు. అసలు మునుగోడు నేతలకు చెప్పకుండా, తమని సంప్రదించకుండా ఈ చేరికలేంటని వారు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు.
రాజగోపాల్ రెడ్డికి కూడా సమాచారం లేదు..
మునుగోడులో బీజేపీ తరఫున బరిలో దిగబోయే అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి కూడా సమాచారం ఇవ్వకుండా ఈ చేరికలేంటని మండిపడుతున్నారు స్థానిక బీజేపీ నేతలు. ఈమేరకు వారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి ఈటలపై ఫిర్యాదు చేశారు. పార్టీకి నష్టం కలిగిస్తున్నారంటూ వాపోయారు.
సర్దుకుపొండి, తర్వాత చూద్దాం..
ఈటల వ్యవహారంతో బండి సంజయ్ కూడా ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. తాడూరి చేరిక విషయంలో సంజయ్ ఆమోదం కూడా లేదని, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ గా ఈటల ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఈ విషయంలో సంజయ్ కూడా కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఈటలపై ఫిర్యాదు చేసేందుకు తన వద్దకు వచ్చిన మునుగోడు బీజేపీ నేతలకు ఆయన సర్దిచెప్పి పంపించారట. ఉప ఎన్నిక అయ్యేవరకు సర్దుకు పోవాలని చెప్పారట. కోపం ఉంటే బయటపడొద్దని, తనపై చూపాలని కూడా బండి సంజయ్ వారిని బతిమిలాడుకున్నారని తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక పార్టీకి కీలకం అని, ఆలోగా ఎవరూ ఆవేశపడొద్దని, గెలుపు అవకాశాలను దెబ్బతీయొద్దని కోరారట. మొత్తమ్మీద మునుగోడులో ఈటల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా, ఆయన పరిధికి మించి ప్రవర్తిస్తున్నారని, స్థానిక నాయకులకు విలువ ఇవ్వడంలేదని చెబుతున్నారు.