అనుకున్నంతా అయ్యింది.. రాజగోపాల్‌కి జ్వరమొచ్చింది..
జ్వరం కారణంతో రాజగోపాల్ రెడ్డి నాంపల్లి మండలంలో జరగాల్సిన ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. అయితే ఈ జ్వరం ఇటీవల ప్రచారంలో ఎదురైన చేదు అనుభవాలతో వచ్చిన జడుపు జ్వరమా, ఓటమి తేలిపోవడంతో వచ్చిన బాధ జ్వరమా, సింపతీ ఓట్లకోసం వచ్చిన దొంగ జ్వరమా అనేది తేలాల్సి ఉంది.
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి జ్వరమొచ్చింది. నాంపల్లి మండలంలో ఈరోజు జరగాల్సిన ప్రచారం రద్దయింది. ఇదేమీ విచిత్రమైన విషయం కాదు కానీ, సరిగ్గా ఈ జ్వరాన్ని రెండు రోజుల ముందు టీఆర్ఎస్ నేతలు అంచనా వేయడమే ఇక్కడ పెద్ద ట్విస్ట్. అవును, అనారోగ్యం సాకుతో రాజగోపాల్ రెడ్డి మునుగోడు ప్రచారానికి దూరం కాబోతున్నారంటూ ఇటీవల టీఆర్ఎస్ నేతలు జోస్యం చెప్పారు. ఈరోజు అది నిజమైంది. రాజగోపాల్ రెడ్డి ప్రచారానికి రావట్లేదంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు, కారణం జ్వరం అని తేల్చారు.
పలాయనవాదమా..?
ఓటమిని ముందుగానే గుర్తించిన రాజగోపాల్ రెడ్డి పలాయనవాదం చిత్తగిస్తున్నారని, అందుకే ఆయన అనారోగ్య కారణాలతో ప్రచారానికి దూరమవుతారని టీఆర్ఎస్ నేతలు ఇటీవల ఎద్దేవా చేశారు. దానికి బలమైన కారణాలున్నాయని కూడా చెప్పారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమైనందున ఆయన సింపతీ కోసం ఈ ఎత్తుగడ వేయొచ్చని అన్నారు. గతంలో దుబ్బాక ఎన్నికల ముందు రఘునందన్ రావు, హుజూర్ నగర్ ఉప ఎన్నిక ముందు ఈటల రాజేందర్ కూడా ఇలా ఆస్పత్రి బెడ్డెక్కారని ఉదాహరణలు కూడా చెప్పారు. బండి సంజయ్ కి అవసరమైనప్పుడు ఇలా జ్వరం పలకరించడం ఆనవాయితీ అనే విషయం కూడా గుర్తు చేశారు. సరిగ్గా వారు ఊహించినట్టే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి జ్వరం రావడం విశేషం. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయినా, చివర్లో ప్రచారం చేయలేకపోవడం వల్లే ఓడిపోయారని చెప్పుకోడానికి ఓ ఆప్షన్ ఉంటుంది.
మళ్లీ ఎప్పుడు.. ?
ఈనెల 31న మునుగోడులో జేపీ నడ్డాతో భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారు బీజేపీ నేతలు. ఈలోగా రాజగోపాల్ రెడ్డి అనారోగ్యం అంటూ ప్రచారానికి దూరం కావడంతో పార్టీ శ్రేణులు కలవరపడుతున్నాయి. కనీసం నడ్డా సభ టైమ్ కి రాజగోపాల్ రెడ్డి కోలుకుంటారా, లేక అప్పుడు కూడా మంచం దిగరా అనేది వేచి చూడాలి. మొత్తానికి జ్వరం కారణంతో రాజగోపాల్ రెడ్డి, నాంపల్లి మండలం పర్యటన రద్దు చేసుకున్నారు. ఇటీవల ప్రచారంలో ఎదురైన చేదు అనుభవాలతో వచ్చిన జడుపు జ్వరమా, ఓటమి తేలిపోవడంతో వచ్చిన బాధ జ్వరమా, సింపతీ ఓట్లకోసం వచ్చిన దొంగ జ్వరమా అనేది తేలాల్సి ఉంది.