Telugu Global
Telangana

ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతోంది..?

ఇక్కడ రాజగోపాల్ సమస్య ఏమిటంటే ప్రచారానికి వెళ్ళిన చాలా గ్రామాల్లో జనాలు చుక్కలు చూపిస్తున్నారు. మాట్లాడనివ్వ‌కుండా అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే అసలు ప్రచారానికి అనుమతించటమే లేదు.

ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతోంది..?
X

ఉపఎన్నికలో పోటీచేస్తున్న ఒక అభ్యర్థి త‌న ప్రచారంలో ఓటర్లను కుక్కలంటూ సంబోధించటం దేనికి సంకేతం..? అందులోనూ గెలుపు తనదేన‌ని చెబుతూనే ఓటర్లతో గొడవలు పడుతుంటే ఏమనుకోవాలి..? మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో చోటుచేసుకున్న ఈ విచిత్రం ఇప్పుడు పెద్ద చర్చగా మారిపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్న సమయంలో చేదు అనుభవం ఎదురైంది. ఒకచోట ప్రచారంలో రాజగోపాల్ మాట్లాడుతున్నప్పుడు జనాలు బాగా గోల చేశారు.

తాను మాట్లాడుతున్నది వినకుండా గోలచేస్తున్నారన్న కోపంతో రాజగోపాల్ జనాలను ఉద్దేశించి కొన్ని కుక్కలొచ్చి మొరుగుతున్నాయి అంటూ మండిపడ్డారు. ఇది అభ్యర్థిలో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ కు నిదర్శమని అర్థ‌మైపోతోంది. ఫ్రస్ట్రేషన్ ఎందుకు పెరిగిపోతోందంటే గెలుపుమీద నమ్మకం కోల్పోతున్నప్పుడే. ఎన్నికలో తాను కచ్చితంగా గెలుస్తాననే నమ్మకం ఉన్న అభ్యర్థి ఓటర్లను కుక్కలతో పోల్చారు.

ఇక్కడ రాజగోపాల్ సమస్య ఏమిటంటే ప్రచారానికి వెళ్ళిన చాలా గ్రామాల్లో జనాలు చుక్కలు చూపిస్తున్నారు. మాట్లాడనివ్వ‌కుండా అడ్డుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే అసలు ప్రచారానికి అనుమతించటమే లేదు. ఇప్పుడు జనాలను ఉద్దేశించి రాజగోపాల్ కుక్కలని సంబోధించిన వెంటనే ఓ వ్యక్తి రాజగోపాల్ నిలబడున్న జీపుపైకి ఎక్కి చెప్పుతో కొట్టడం సంచలనంగా మారింది. రాజగోపాల్ ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుండి ప్రజల నుంచి ఇలాంటి స్పందనలే ఎక్కువగా ఎదురవుతున్నాయి.

తనను గెలిపిస్తాడని ఆశలు పెట్టుకున్న అన్న, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా చివరకు చేతులెత్తేసి ఆస్ట్రేలియాకు వెళ్ళిపోయారు. తమ్ముడి గెలుపున‌కు అన్న స్ధానికంగా ఏమైనా సీక్రెట్ గా ఏర్పాట్లు చేసి వెళ్ళారా లేకపోతే ఏమీ చేయలేక ఇక్కడుండి లాభంలేదని తెలుసుకుని విహారయాత్రకు వెళ్ళిపోయారా..? అన్నదే ఎవరికీ అర్థం కావటంలేదు. ఏదేమైనా ఒకవైపు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డి, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటున్నారు. మధ్యలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి మాత్రమే ఈ సమస్యలు ఎందుకు ఎదురవుతున్నాయి..? ఓటర్లను రాజగోపాల్ మాత్రమే ఎందుకు బూతులు తిడుతున్నారు..? అన్నదే ఇక్కడ పాయింట్.

First Published:  25 Oct 2022 12:50 PM IST
Next Story