Telugu Global
Telangana

మునుగోడులో ఘర్ వాపసీ.. బీజేపీలో భయం భయం..

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోపాటు, క్యాడర్‌ని కూడా గుంపగుత్తగా బీజేపీలోకి చేర్చుకోవాలనుకుంది అధిష్టానం. అమిత్ షా వచ్చినా, నడ్డా వచ్చినా చేరికలు లేవు. కాంగ్రెస్ కేడర్‌లోని కొందరు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు

మునుగోడులో ఘర్ వాపసీ.. బీజేపీలో భయం భయం..
X

వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్.. గతంలో ఘర్ వాపసీ అంటూ ఓ కార్యక్రమం చేపట్టాయి, అది మతపరమైన కార్యక్రమం. ఇప్పుడు తెలంగాణలో కూడా ఘర్ వాపసీ మొదలైంది. ఇది రాజకీయ కార్యక్రమం. ముఖ్యంగా మునుగోడులో ఘర్ వాపసీ సూపర్ సక్సెస్ అవుతుందని అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీ, కాంగ్రెస్ లోకి వెళ్లిన టీఆర్ఎస్ కార్యకర్తలంతా ఇప్పుడు సొంతగూటికి చేరుకుంటున్నారు. తొందరపాటులో బీజేపీలో చేరిన కొంతమంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు.. ఆ పార్టీలో ఇమడలేక తిరిగి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం పెద్దాపురం గ్రామానికి చెందిన 50 కుటుంబాల వారు ఇటీవల బీజేపీలో చేరారు. అక్కడ ఇమడలేక తిరిగి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి సమక్షంలో వీరంతా తిరిగి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ ప్లాన్ రివర్స్..

కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితోపాటు, క్యాడర్‌ని కూడా గుంపగుత్తగా బీజేపీలోకి చేర్చుకోవాలనుకుంది అధిష్టానం. అమిత్ షా వచ్చినా, నడ్డా వచ్చినా చేరికలు లేవు. కాంగ్రెస్ కేడర్‌లోని కొందరు టీఆర్ఎస్‌లోకి వెళ్లిపోయారు, మరికొంతమంది వేచి చూస్తున్నారు. కానీ బీజేపీ వైపు మాత్రం వెళ్లట్లేదు.

హుజూరాబాద్ గుణపాఠం..

హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలిచినా.. ఆయనతో ఉన్న నాయకులకు, కార్యకర్తలకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అధికార పార్టీతో ఉన్నవారికే అక్కడ రాజకీయ భవిష్యత్తుపై ఆశలున్నాయి. ఈ గుణపాఠమే ఇప్పుడు మునుగోడులో చాలామందికి కనువిప్పులా మారింది. నాయకులు తమ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారుతున్నారని, వారి వెంట నడిచి తమ భవిష్యత్తును పాడుచేసుకోలేమని అంటున్నారు కార్యకర్తలు.

గతంలో హడావిడి..

ఆ మధ్య రాజగోపాల్ రెడ్డి కంటే ముందే కొన్ని కుటుంబాలను బీజేపీ ఆకర్షించింది. మునుగోడులో ఉప ఎన్నిక వ‌స్తుంద‌ని, ముందుగానే వస్తే ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కొంతమందిని ఆకట్టుకున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు టీఆర్ఎస్‌లోకి వస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని డీ నాగారం గ్రామానికి చెందిన 50 కుటుంబాలు, నల్లగొండ జిల్లా చండూరు మండలంలోని నెర్మట గ్రామానికి చెందిన వివిధ పార్టీలవారు టీఆర్‌ఎస్‌ గూటికి చేరుకున్నారు.

First Published:  31 Aug 2022 3:37 AM GMT
Next Story