Telugu Global
Telangana

థ్యాంక్యూ హైదరాబాద్..

ఇక్కడి ప్రజల ప్రేమకు నా ధన్యవాదాలు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రేమను, హాస్యాన్ని పంచడానికి తనకు సహకరించారని అన్నారు. మంత్రి కేటీఆర్, సైబరాబాద్ పోలీస్ లను ప్రత్యేకంగా తన ట్వీట్ లో మెన్షన్ చేసి మరీ ధన్యవాదాలు తెలిపారు మునావర్.

థ్యాంక్యూ హైదరాబాద్..
X

బీజేపీ అనుబంధ సంస్థల వార్నింగ్ లు ఓవైపు, స్వయానా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పేల్చిన డైలాగులు మరోవైపు.. సందేహాలు, సంశయాల.. మధ్య స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారుఖి కామెడీ షో విజయవంతంగా హైదరాబాద్ లో పూర్తయింది. శిల్పకళా వేదికలో ప్రేక్షకుల హర్షధ్వానాల మధ్య ఆ షో విజయవంతమైంది. మునావర్ పై ఈగవాలలేదు, అలాగని ఎక్కడా ఆందోళనలతో పరిస్థితి అదుపు తప్పలేదు. అంతా ప్రశాంతంగా ఉంది. ఈమాత్రం దానికి బీజేపీ అంత ఎగిరెగిరి పడాలా అని నెటిజన్లు గడ్డిపెడుతున్నారు. మొత్తమ్మీద మునావర్ కామెడీ షో హైదరాబాద్ వేదికగా ప్రశాంతంగా పూర్తి కావడం మాత్రం సంతోషించదగ్గ విషయమే. హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. దాదాపు 2వేలమంది పోలీసులు ఈ షో కి సంబంధించి ప్రత్యేక బాధ్యత తీసుకున్నారు. పరిస్థితులు అదుపు తప్పకుండా పహారా కాశారు. ఈ షో సక్సెస్ అయినందుకు మునావర్ ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపారు. థ్యాంక్యూ హైదరాబాద్ అని ట్వీట్ చేశారు. ఇక్కడి ప్రజల ప్రేమకు నా ధన్యవాదాలు అని స్టేట్ మెంట్ ఇచ్చారు. ప్రేమను, హాస్యాన్ని పంచడానికి తనకు సహకరించారని అన్నారు. మంత్రి కేటీఆర్, సైబరాబాద్ పోలీస్ లను ప్రత్యేకంగా తన ట్వీట్ లో మెన్షన్ చేసి మరీ ధన్యవాదాలు తెలిపారు మునావర్.

పూర్తయ్యే వరకు టెన్షన్ టెన్షన్..

ఓవైపు తెలంగాణలో అమిత్ షా సభ, మరోవైపు అదే అమిత్ షా, మోదీపై చెణుకులు విసరడంలో దిట్ట అయిన ఓ కుర్రాడి కామెడీ షో. అసలు ఏంజరుగుతుందా అనే ఉత్కంఠలో తెలంగాణ ప్రభుత్వం తరపున కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆయన హామీ మేరకు ఇక్కడ ప్రశాంతంగా మునావర్ షో ముగిసింది.

బీజేపీ భయపడినంత ఉందా..?

మునావర్ వస్తే మనల్ని మామూలుగా ఉతకడు అని బీజేపీ నాయకులకు అనుమానం ఉంది. అందులోనూ ఆయన షో లను వివిధ ప్రాంతాల్లో అడ్డుకుంటున్నారన్న కక్షతో మరింత దారుణంగా సెటైర్లు వేస్తారేమోననే భయం కూడా వారిలో ఉంది. అందుకే బీజేపీ నేతలంతా శిల్పకళా వేదికకు చేరుకుని ఆందోళన చేయాలనుకున్నారు, అరెస్ట్ అయ్యారు, కొంతమంది విసిగి వేసారి వెళ్లిపోయారు. అయితే ఈ కామెడీ షోలో.. బీజేపీ భయపడినంత లేదని, మునావర్ పొలిటికల్ విషయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా సహజ శైలిలో తన కామెడీ పండించారని అంటున్నారు. ఈ షో లో ఎవరికీ మొబైల్ వాడే అనుమతి లేదు కాబట్టి.. లోపల ఎవరిపై పంచ్ లు పడ్డాయనేది ఎవరికీ తెలియదు. కానీ లేనిపోని అపోహలతో ఓ కార్యక్రమాన్ని అడ్డుకోడానికి, ఓ యువకుడి ప్రతిభను తొక్కేయడానికి బీజేపీ వేసిన పన్నాగం మాత్రం విఫలమైంది.

First Published:  22 Aug 2022 7:28 AM IST
Next Story