Telugu Global
Telangana

సీతక్క వర్సెస్ నాగజ్యోతి.. ములుగులో పోస్టర్ల కలకలం

సీతక్క సింప్లిసిటీతో ములుగు ప్రజలకు దగ్గర కాగా.. నాగజ్యోతి కూడా అంతే డౌన్ టు ఎర్త్ ఉంటారు. పైగా అధికార పార్టీ అభ్యర్థి కావడం, బీఆర్ఎస్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఉండటం నాగజ్యోతికి కలిసొచ్చే అదనపు అంశాలు. దీంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారే అవకాశముంది.

సీతక్క వర్సెస్ నాగజ్యోతి.. ములుగులో పోస్టర్ల కలకలం
X

ధనబలం వర్సెస్ ప్రజా బలం అంటూ ములుగులో వెలసిన వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ధనబలంతో బరిలో దిగుతున్నారని, కానీ బీఆర్ఎస్ అభ్యర్థి నాగజ్యోతికి జనబలం ఉందని పోస్టర్లు వేశారు. ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే దనసరి అనసూయ అలియాస్ సీతక్కకు పోటీగా ఈసారి బీఆర్ఎస్ నుంచి బడే నాగజ్యోతి బరిలో దిగుతున్నారు. ఈసారి సీతక్కకు గట్టిపోటీ ఖాయమంటున్నారు స్థానికులు. సీతక్క సింప్లిసిటీతో ములుగు ప్రజలకు దగ్గరైనా.. అధికార పార్టీ కాకపోవడంతో సమస్యల పరిష్కారం ఆమెకు సాధ్యం కావడంలేదు. ఈసారి బీఆర్ఎస్ కూడా మహిళా అభ్యర్థినే బరిలో దింపడంతో అక్కడ పోటీ రసవత్తరంగా మారింది.

ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్ గా బడే నాగజ్యోతి పనిచేస్తున్నారు. ఆమెను సడన్ గా ఎమ్మెల్యే అభ్యర్థిగా తెరపైకి తెచ్చింది బీఆర్ఎస్. నాగజ్యోతి కుటుంబానికి కూడా నక్సల్ ఉద్యమ నేపథ్యం ఉండటం విశేషం. నక్సలైట్ ఉద్యమంలో పనిచేస్తూ నాగజ్యోతి తల్లిదండ్రులు బడే ప్రభాకర్, నిర్మలక్క ప్రాణాలు కోల్పోయారు. నాగజ్యోతి బీఆర్ఎస్ లో అంచెలంచలుగా పైకి ఎదిగారు, ఇప్పుడు ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిగా మారారు.

బీఆర్ఎస్ పార్టీ ఈసారి కొన్ని నియోజకవర్గాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచింది. అందులో ములుగు ఒకటి. 2014లో మాత్రమే ములుగులో బీఆర్ఎస్ విజయం దక్కించుకుంది. అది కూడా టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఓట్లు చీలిపోవడం వల్ల లభించిన విజయం. ఈసారి సీతక్కను ఎలాగైనా ఓడించాలని బీఆర్ఎస్ నాగజ్యోతిని రంగంలోకి దింపింది. ఇప్పటికీ పూరింటిలోనే ఆమె నివాసం. సీతక్క సింప్లిసిటీతో ములుగు ప్రజలకు దగ్గర కాగా.. నాగజ్యోతి కూడా అంతే డౌన్ టు ఎర్త్ ఉంటారు. పైగా అధికార పార్టీ అభ్యర్థి కావడం, బీఆర్ఎస్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఉండటం ఆమెకు కలిసొచ్చే అదనపు అంశాలు. దీంతో ఈసారి పోటీ రసవత్తరంగా మారే అవకాశముంది.

First Published:  17 Oct 2023 7:53 AM GMT
Next Story