Telugu Global
Telangana

నన్ను రీల్ అన్నారు, ఎగతాళి చేశారు..

తనను రీల్ అంటూ ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క. వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో తనను ఇబ్బంది పెట్టారన్నారు.

నన్ను రీల్ అన్నారు, ఎగతాళి చేశారు..
X

తెలంగాణ ఎన్నికల్లో ఈసారి టఫ్ ఫైట్ జరిగిన నియోజకవర్గాల్లో ములుగు కూడా ఒకటి. ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క మరోసారి కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేయగా.. ములుగు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉన్న బడే నాగజ్యోతిని బీఆర్ఎస్ తరపున బరిలో దింపారు. వీరిద్దరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోటీ జరిగింది. రిజల్ట్ రేపు రాబోతున్న దశలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన వెలిబుచ్చారు. ములుగులో గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.

నన్ను రీల్ అన్నారు..

కరోనా సమయంలో, వరదల సమయంలో సీతక్క ప్రజా సేవ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఆమె కేవలం కెమెరాలకు మాత్రమే ఫోజులిచ్చారని, రీల్స్ చేసి వైరల్ అయ్యారని వైరి వర్గాలు విమర్శలు చేశాయి. ఎన్నికల వేళ కూడా ఈ విమర్శలు వినిపించాయి. తాను నిజంగానే ప్రజా సేవ చేశానని, కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నానని, కానీ కొంతమంది తనను రీల్ అంటూ ఎగతాళి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క. వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో తనను ఇబ్బంది పెట్టారన్నారు.

డబ్బులతో కొనుగోలు చేశారు..

ములుగులో కాంగ్రెస్ కార్యకరక్తలను, తన అనుచరులను ప్రత్యర్థి వర్గాలు డబ్బులతో కొనుగోలు చేశాయని విమర్శించారు సీతక్క. సీతక్క కొడుకు దళితబంధు ఇప్పిస్తానంటో మోసం చేశారనే ఆరోపణలు కూడా ఎన్నికల వేళ వినిపించాయి. పరోక్షంగా సీతక్క ఈ విమర్శలపై స్పందించారు. తనతో ఉన్నవారినే డబ్బులతో కొనుగోలు చేసి, తప్పుడు ఆరోపణలు చేయించారని అన్నారామె. ఏ కష్టం వచ్చినా తాను జనం వెంటే ఉంటానన్నారు సీతక్క. పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేలా కృషి చేస్తానన్నారు.


First Published:  2 Dec 2023 4:41 PM IST
Next Story