Telugu Global
Telangana

బీఆర్ఎస్ వ్యూహంతో కాంగ్రెస్ విలవిల.. ములుగులో పెద్ద షాక్

సీతక్కను రాష్ట్రవ్యాప్త ప్రచారానికి తీసుకు రావాలనుకున్నా కూడా అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఆమె ముందు తన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ వ్యూహాల ముందు కాంగ్రెస్ తేలిపోతోంది.

బీఆర్ఎస్ వ్యూహంతో కాంగ్రెస్ విలవిల.. ములుగులో పెద్ద షాక్
X

తెలంగాణలో అధికారం తమదేనంటోంది కాంగ్రెస్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని సైతం ఓడిస్తామంటూ గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అయితే ఈ డైలాగులకు ఎక్కడా బీఆర్ఎస్ అదరలేదు, బెదరలేదు. పైగా శత్రువుని ఓ వ్యూహం ప్రకారం దెబ్బకొడుతూ వస్తోంది. కాంగ్రెస్ బలహీనంగా ఉన్నచోట్లే కాదు, ఆ పార్టీ బలంగా ఉంది అనుకున్నచోట కూడా ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని తాజాగా కోలుకోలేని దెబ్బ కొట్టంది బీఆర్ఎస్. ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి గులాబిదళంలో చేరారు.



ములుగు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కొమరం ధనలక్ష్మి బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ములుగు సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క నామినేషన్‌ రోజే ధనలక్ష్మి పార్టీ మారడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ నాయకులు ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నారు. తాజాగా ధనలక్ష్మి వెళ్లిపోవడంతో సీతక్క వర్గం డీలాపడింది. ములుగు నియోజకవర్గంతోపాటు, జిల్లా మొత్తం మీద ఆ ప్రభావం కనపడుతోంది.

ములుగులో ఈసారి సీతక్క విజయం అంత సులభం కాదని అర్థమవుతోంది. ఆమె ప్రత్యర్థిగా బడే నాగజ్యోతిని తెరపైకి తెచ్చారు. సీతక్కకు మావోయిస్ట్ ఉద్యమ నేపథ్యం ఉంది. నాగజ్యోతి తల్లిదండ్రులు కూడా ఉద్యమంలో పనిచేసినవారే. ఆమె కూడా సామాన్య కుటుంబం నుంచి రాజకీయ నాయకురాలిగా ఎదిగారు. సీతక్కలాగే డౌన్ టు ఎర్త్ ఉంటారు. నాగజ్యోతికి ప్రజల్లో ఆదరణ స్పష్టంగా తెలుస్తోంది. సీతక్కపై వ్యక్తిగతంగా ప్రజల్లో అయిష్టత లేకున్నా.. కాంగ్రెస్ ని మాత్రం ప్రజలు నమ్మడంలేదు. ఇటు బీఆర్ఎస్ పథకాల విషయంలో, కేసీఆర్ పాలనపై ప్రజల్లో పూర్తి స్థాయి నమ్మకం ఉంది. బడే నాగజ్యోతికి అది బాగా కలిసొచ్చే అంశం. ఇక ఇటీవల చేరికలతో ములుగు జిల్లాలో కాంగ్రెస్ డీలా పడింది. సీతక్కను రాష్ట్రవ్యాప్త ప్రచారానికి తీసుకు రావాలనుకున్నా కూడా అది సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ఆమె ముందు తన నియోజకవర్గంపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. ములుగు జిల్లాలో బీఆర్ఎస్ వ్యూహాల ముందు కాంగ్రెస్ తేలిపోతోంది.

First Published:  9 Nov 2023 2:10 AM GMT
Next Story