Telugu Global
Telangana

కాంగ్రెస్ పై ముదిరాజ్ ల కాక

నీలంకు ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ వెనక్కి తీసుకుంది. దీంతో ముదిరాజ్ వర్గం రగిలిపోతోంది. అసలు టికెట్ కేటాయింపులు లేకుండా ఉంటే అదోరకం, కానీ టికెట్ ఇచ్చి ఇలా అవమానించడమేంటని అంటున్నారు ఆ వర్గం నేతలు.

కాంగ్రెస్ పై ముదిరాజ్ ల కాక
X

కాంగ్రెస్ పార్టీ, పటాన్ చెరులో తన నెత్తిన తానే చేయి పెట్టుకున్నట్టయింది. అక్కడ నీలం మధు ముదిరాజ్ కి కేటాయించిన టికెట్ ని చివరి నిమిషంలో మార్చి కాట శ్రీనివాస్ గౌడ్ కి ఇచ్చారు. దీంతో నీలం వర్గం రగిలిపోతోంది. నమ్మించి గొంతుకోశారని, ముదిరాజ్ ల సత్తా ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు మధు. తన వర్గంతో ఆయన సమావేశం అయ్యారు. టికెట్ ఇచ్చి క్యాన్సిల్ చేయడమేంటని నిలదీశారు. తమ జాతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందన్నారు. ఇదే ఆవేదనతో ప్రజల్లోకి వెళ్తానని, కచ్చితంగా పటాన్ చెరు నుంచి తాను పోటీ చేసి తీరతానంటున్నారు. ఈ అసమ్మతి సెగతో కాంగ్రెస్ కి ఇక్కడ గెలుపు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయినట్టే లెక్క. బుజ్జగింపులు కూడా ఈ దశలో పనిచేసేలా లేవు.

రగిలిపోతున్న ముదిరాజ్ వర్గం..

పటాన్ చెరులో కాట శ్రీనివాస్ గౌడ్ చాన్నాళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి వర్గంగా పేరున్న నీలం మధుకి అధిష్టానం అనూహ్యంగా టికెట్ ఇచ్చింది. టికెట్ కేటాయింపుల్లోనే వివాదాలున్నాయి. కాట వర్గం రగిలిపోయింది, రేవంత్ రెడ్డి టికెట్ అమ్ముకున్నాడనే ఆరోపణలు చేసింది. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమవడం, ఒకరిద్దరు సీనియర్లు కూడా అలగడంతో అక్కడ అధిష్టానం తన నిర్ణయాన్ని మార్చుకుంది. నీలంకు ఇచ్చినట్టే ఇచ్చి టికెట్ వెనక్కి తీసుకుంది. దీంతో ముదిరాజ్ వర్గం రగిలిపోతోంది. అసలు టికెట్ కేటాయింపులు లేకుండా ఉంటే అదోరకం, కానీ టికెట్ ఇచ్చి ఇలా అవమానించడమేంటని అంటున్నారు ఆ వర్గం నేతలు.

రేవంత్ రెడ్డిపై ప్రభావం..

పటాన్ చెరు టికెట్ మార్పు విషయంలో రేవంత్ రెడ్డి మాట చెల్లకుండా పోయింది, అక్కడ ఆయన వైరివర్గం పైచేయి సాధించింది. ఇక నీలం ముదిరాజ్ కి టికెట్ కేటాయిస్తే.. కొడంగల్ లో ముదిరాజ్ వర్గం తనకు మద్దతిస్తుందనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఇక్కడ నీలంకు టికెట్ క్యాన్సిల్ కావడంతో ముదిరాజ్ సామాజిక వర్గానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆందోళన రేవంత్ లో ఉంది. ఆ ప్రభావం కొడంగల్ లో కూడా కనపడే అవకాశముంది. ఈ టికెట్ క్యాన్సిలేషన్ వల్ల ఎక్కువగా నష్టపోయేది రేవంత్ రెడ్డేననే ప్రచారం జరుగుతోంది.

First Published:  10 Nov 2023 7:38 AM IST
Next Story