Telugu Global
Telangana

ఎస్సీ వర్గీకరణ జాప్యాన్ని నిరసిస్తూ.. రేపు ఎమ్మార్పీఎస్ నిరసనలు

రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండానే 11 వేల టీచర్ పోస్టుల భర్తీని రేవంత్ సర్కార్ చేపడుతున్నదని విమర్శించారు.

ఎస్సీ వర్గీకరణ జాప్యాన్ని నిరసిస్తూ.. రేపు ఎమ్మార్పీఎస్ నిరసనలు
X

ఎస్సీ వర్గీకరణ జాప్యాన్ని నిరసిస్తూ రేపు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని నిరసిస్తూ రేపు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చింది. జిల్లా కేంద్రాల్లో అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేయాలని.. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నేతలకు పిలుపునిచ్చారు.హైదరాబాద్‌లో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బషీర్ బాగ్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని.. మాదిగలను నట్టేట ముంచుతున్నారని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. తేనె పూసినట్లుగా తియ్యటి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో మాత్రం మాదిగలకు నమ్మద్రోహం చేస్తున్నారని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెబితే ఈ తీర్పు వచ్చిన అరగంటలోనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఈ దేశంలోనే అందరికంటే ముందే తెలంగాణలో వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని కానీ మాలల ఒత్తిడితో నమ్మకద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి మాలలకు కొమ్ము కాస్తూ మాదిగలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చి.. మాలలకు ఎక్కువ టికెట్లు ఇచ్చారని మండిపడ్డారు. శాసనసభ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గడానికి కారణం రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. వివేక్, వినోద్ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా.. వంశికి ఎంపీ టికెట్ ఇచ్చారన్నారు. పార్టీ మారి వచ్చిన వివేక్ కుటుంబంలో రెండు సీట్లు ఇచ్చారన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో మాదిగలకు ఒక్క ఎంపీ టిక్కెట్ ఇవ్వలేదని మందకృష్ణ అన్నారు. ఆగస్టు1 సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన అర్ధ గంటకే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఉద్యోగాలకు కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పారని తెలిపారు. అయితే రెండు నెలలు కాకముందే రేవంత్ రెడ్డి మాటా మరిచి మాదిగలకు వెన్నుపోటు పొడిచారని కృష్ణ మాదిగ ఆరోపించారు.

First Published:  8 Oct 2024 3:41 PM IST
Next Story