Telugu Global
Telangana

మరో 4రోజులు ఐసీయూలోనే చికిత్స.. దాడి కేసులో కొత్త విషయాలు

ఆపరేషన్ విజయవంతం అయిందని, అయితే ఎంపీ ప్రభాకర్ రెడ్డి నాలుగు రోజులు అబ్జర్వేషన్లోనే ఉండాలన్నారు వైద్యులు.

Kotha Prabhakar Reddy Health మరో 4రోజులు ఐసీయూలోనే చికిత్స.. దాడి కేసులో కొత్త విషయాలు
X

కత్తిపోటు ఘటనలో తీవ్రంగా గాయపడిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, యశోద ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. ఆయనకు నిన్న ఆపరేషన్ చేశారు వైద్యులు. చిన్న ప్రేగుని 10సెంటీమీటర్ల మేర తొలగించారు. అంతర్గత రక్తస్రావాన్ని శుభ్రం చేశారు. ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండాలంటే ఆయన మరో నాలుగు రోజులపాటు ఐసీయూలోనే ఉండాలని చెప్పారు వైద్యులు. ఆపరేషన్ విజయవంతం అయిందని, అయితే ఆయన నాలుగు రోజులు అబ్జర్వేషన్లోనే ఉండాలన్నారు.

ఎంపీపై హత్యాయత్నం చేసిన నింతుడు రాజు ప్రస్తుతం హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడు కోలుకున్న తర్వాత కోర్టులో ప్రవేశ పెట్టే అవకాశముంది. నిందితుడు కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. అతడి కుటుంబ సభ్యులనుంచి కూడా వివరాలు సేకరించారు. ఈ కేసు విషయంలో కీలక విషయాలు ఇప్పడు బయటపడుతున్నాయి. ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నానికి మూడు రోజుల ముందు నుంచే రాజు రెక్కీ నిర్వహించినట్టు సమాచారం. ఎంపీ ప్రచార షెడ్యూల్, కదలికలను ఎప్పటికప్పుడు నిందితుడు తెలుసుకున్నాడు. పక్కా స్కెచ్ తో సూరంపల్లిలో అటాక్ చేశాడు.

మూడు రోజుల క్రితం మిరుదొడ్డిలో బీఆర్ఎస్ నాయకుల నుంచి ఎంపీ పర్యటన వివరాలపై ఆరా తీశాడు రాజు. ఆదివారం తొగుటలో ఎంపీ ప్రచారాన్ని పరిశీలించాడు. సోమవారం దౌల్తాబాద్ మండలంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ఎంపీని రాజు ఫాలో అయ్యాడు. మీడియా ఐడీకార్డ్ ఉండటంతో ఆయన్ను ఎవరూ అనుమానించలేదు. సూరంపల్లి గ్రామంలో ఎంపీ ప్రచార రథంపైకి ఎక్కడానికి ప్రయత్నించట్లు సమాచారం. ఎంపీ కారు వద్దకు రాగానే సెల్ఫీ దిగుతానని వెళ్లి కత్తితో దాడి చేశాడు.

కారణం ఏంటి..?

ఎంపీపై దాడికి అసలు కారణం ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు. అయితే సోషల్ మీడియాలో నిందితుడు రాజు వాట్సప్ చాటింగ్ వైరల్ గా మారింది. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో వాట్సప్ లో చాట్ చేసినట్టు కొన్ని స్క్రీన్ షాట్ లు వైరల్ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై కూడా పోలీసులు దృష్టిసారించారు. రాజు కాంగ్రెస్ కార్యకర్త అనే ప్రచారం కూడా ఉంది.

First Published:  31 Oct 2023 7:46 AM GMT
Next Story