బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలా..?
బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. టికెట్లు దక్కని ఆశావహులు పక్క చూపులు చూస్తున్నారు. అలాంటి వారితో వారు మారాలనుకుంటున్న పార్టీలోని ఆశావహులు ఇబ్బంది పడుతున్నారు.
బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి వేముల వీరేశం టికెట్ విషయమై అనుచరులతో మంతనాలు జరిపారాయన. ఒకవేళ వీరేశంకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఎలా వ్యవహరించాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే విషయంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి కార్యకర్తలు ఇబ్బందిపడొద్దని సూచించారు.
బీఆర్ఎస్ పార్టీ తొలి జాబితా ప్రకటించిన తర్వాత తెలంగాణ రాజకీయ వాతావరణం వేడెక్కింది. టికెట్లు దక్కని ఆశావహులు పక్క చూపులు చూస్తున్నారు. అలాంటి వారితో వారు మారాలనుకుంటున్న పార్టీలోని ఆశావహులు ఇబ్బంది పడుతున్నారు. వారికి టికెట్ ఇస్తే మా సంగతేంటని నేరుగానే ప్రశ్నిస్తున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఇప్పుడు అలాంటి సమస్యే తలెత్తింది. 2018లో అక్కడ వేముల వీరేశం బీఆర్ఎస్ తరపున పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య విజయం సాధించారు. ఈసారి లింగయ్యకే బీఆర్ఎస్ టికెట్ కేటాయించగా, వీరేశం అలిగారు. బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పిన వీరేశం కాంగ్రెస్ లోకి రావాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆ టికెట్ పై ఆశలు పెట్టుకున్నవారు ఎంపీ కోమటిరెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.
ఎవరో వస్తున్నారనే మాటలు, కథనాలు నమ్మి కార్యకర్తలు ఆవేశపడొద్దని వారికి సూచించారు ఎంపీ కోమటిరెడ్డి. కార్యకర్తలు, స్థానిక నాయకులు ఎవరి పేరు సూచిస్తే వారిని అభ్యర్థిగా ప్రకటిస్తానని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఉచిత విద్యుత్ పై నోరు జారితే.. లాగ్ బుక్ బయట పెట్టి నష్ట నివారణ చర్యలు చేపట్టానని వెల్లడించారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని వీరేశంను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గెలిచినా పార్టీ విడిచి వెళ్ళని వారు, కబ్జాలకు, బెదిరింపులకు, పాల్పడని వారు కావాలన్నారు. శాంతియుత నకిరేకల్ నియోజకవర్గమే తన లక్ష్యం అని చెప్పారు కోమటిరెడ్డి. తన వ్యవసాయ క్షేత్రంలో కార్యకర్తలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు.
♦