నల్గొండ సీటు త్యాగం చేస్తా -కోమటిరెడ్డి
కాంగ్రెస్ లో ఇంకా లిస్ట్ కూడా బయటకు రాలేదు కానీ అప్పుడే టికెట్ల గోల మొదలైంది. అవసరమైతే నల్గొండ సీటు సైతం త్యాగం చేస్తానంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీకి సంబంధించి బీఆర్ఎస్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తులు బయటపడ్డారు. కానీ కాంగ్రెస్ లో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యేలా ఉంది. ప్రస్తుతానికి జస్ట్ అప్లికేషన్లు మాత్రమే తీసుకున్నారు. ఇంకా లిస్ట్ కూడా బయటకు రాలేదు. కానీ అప్పుడే టికెట్ల గోల మొదలైంది. అవసరమైతే నల్గొండ సీటు సైతం త్యాగం చేస్తానంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు. బీసీల కోసం తాను త్యాగం చేస్తానంటున్నారు.
బీసీ రాజకీయం..
తెలంగాణ కాంగ్రెస్ లో ఈ సారి బీసీలు టికెట్ల కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. బీఆర్ఎస్ తో పోటీ పెట్టుకోకుండా ప్రతి పార్లమెంట్ పరిధిలో కనీసం 3 స్థానాలు బీసీలకు ఇవ్వాలంటున్నారు. అయితే గెలుపు ఓటముల బలాబలాలు బేరీజీ వేసుకోవాలని ఇతర కులాల నాయకులు సూచిస్తున్నారు. ఈ గొడవ తేలకముందే అప్లికేషన్లు తీసుకున్నారు. అయితే తమతోపాటు తమ అనుచరులకు కూడా టికెట్లు ఇప్పించుకోవాలనే పట్టుదలతో ఉన్న కోమటిరెడ్డి వంటి నేతలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. నకిరేకల్ నియోజకవర్గానికి సంబంధించి వేముల వీరేశం టికెట్ విషయమై ఇటీవలే అనుచరులతో మంతనాలు జరిపారు కోమటిరెడ్డి. పక్క పార్టీ నుంచి వస్తే టికెట్ ఇవ్వాలా అని ప్రశ్నించారాయన. ఈ క్రమంలో బీసీలకు తన సీటు సైతం త్యాగం చేస్తానంటూ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
బీఆర్ఎస్ పై విమర్శలు..
తెలంగాణలో హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి. ఎన్నికల ముందు కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారాయన. కాంగ్రెస్ తరపున అప్లికేషన్లు పెట్టుకున్న నాయకులందరితో వన్ టు వన్ ఇంటర్వ్యూ ఉంటుందని, ఆ తర్వాతే టికెట్ల కన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పారు కోమటిరెడ్డి.
♦