Telugu Global
Telangana

తగ్గేది లేదన్న మోతీలాల్.. సీఎం రేవంత్ రెడ్డి హామీ కోసం పట్టు

మోతీలాల్ దీక్ష వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చలకోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు.

తగ్గేది లేదన్న మోతీలాల్.. సీఎం రేవంత్ రెడ్డి హామీ కోసం పట్టు
X

నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వ బుజ్జగింపులు పనిచేయలేదు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తేనే తాను దీక్ష విరమిస్తానని తేల్చి చెప్పారు మోతీలాల్. దీంతో గాంధీ ఆస్పత్రి వద్దకు వచ్చి ఆయనతో చర్చలు జరిపిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెనుదిరిగి వెళ్లిపోయారు.

గ్రూప్ -1 లో ఒక పోస్ట్ కి 100మందిని మెయిన్స్ పరీక్షకోసం ఎంపిక చేయాలని తెలంగాణలో నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్-2, 3 పోస్ట్ ల సంఖ్య పెంచాలని నిరుద్యోగుల తరపున మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష మొదలు పెట్టారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు పెట్టాలని కూడా ఆయన కోరుతున్నారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధనకోసం దీక్ష చేస్తున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో కూడా ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నేతలు మోతీలాల్ నాయక్ ను పరామర్శించారు. దీక్ష విరమించాలని కోరారు, నిరుద్యోగుల పోరాటానికి తాము మద్దతిస్తామన్నారు.

మోతీలాల్ దీక్ష వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు దిగింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చలకోసం గాంధీ ఆస్పత్రికి వెళ్లారు. నిరుద్యోగులు ఆయన్ను మెయిన్ గేట్ వద్ద అడ్డుకున్నారు. చివరకు పోలీసులు వారికి సర్దిచెప్పి ఎమ్మెల్సీ వెంకట్ ని లోపలికి తీసుకెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డితో తాను మాట్లాడతానని, దీక్ష విరమించాలని కోరారు ఎమ్మెల్సీ. కానీ మోతీలాల్ నాయక్ మెత్తబడలేదు. నేరుగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇస్తేనే తాను దీక్ష విరమిస్తానన్నారు. దీంతో చర్చలు విఫలమైనట్టు తేలింది. మరోవైపు మోతీలాల్ కు నిరుద్యోగుల మద్దతు పెరుగుతోంది. యువతీయువకులు పెద్ద సంఖ్యలో గాంధీ ఆస్పత్రికి చేరుకుంటున్నారు.

First Published:  1 July 2024 8:29 AM IST
Next Story