కేసీఆర్ పోటీచేసే చోట్లే అత్యధిక నామినేషన్లు.. కారణమేంటి..?
కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,355 నామినేషన్లు దాఖలు అయ్యాయి. స్క్రూటినీ సోమవారం పూర్తవడంతో లీగల్‌గా చెల్లుబాటయిన నామినేషన్ల లెక్క ఇదీ. వీటిలో అత్యధికంగా నామినేషన్లు దాఖలైన మొదటి నియోజకవర్గం గజ్వేల్ అయితే మూడోది కామారెడ్డి. ఇవి రెండూ బీఆర్ఎస్ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న నియోజకవర్గాలే కావడం ఆసక్తి రేపుతోంది.
గజ్వేల్‌లో 157 మంది
కేసీఆర్ సొంత నియోజకవర్గమైన గజ్వేల్ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. మొత్తం 157 నామినేషన్లలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్స్ బాధితులే ఉన్నారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించాలనే డిమాండ్‌ను గట్టిగా వినిపిచాలన్న ఉద్దేశంతో జగిత్యాల చెరుకు రైతులు పోటీకి దిగారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువ మంది ధరణిలో సమస్యలు ఎదుర్కొన్నవారు, వివిధ సమస్యల బాధితులున్నారు. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి 102 నామినేషన్లు వచ్చాయి. ఇక్కడా కేసీఆరే పోటీ చేస్తుండటం గమనార్హం.
గెలుస్తామని కాదంటున్న అభ్యర్థులు
నిరసన తెలిపే ఉద్దేశంతోనే వీరిలో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ సమస్యలపై తమ నిరసన గళం వినిపించాలనే నామినేషన్లు వేసినట్లు చెబుతున్నారు. అంతే తప్ప గెలుస్తామని వాళ్లకు ఎలాగూ ఆశ లేదు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న చోట తామూ నామినేషన్ వేస్తే తమ పేరు ప్రచారంలోకి వస్తుందని భావించేవాళ్లూ ఉండొచ్చంటున్నారు విశ్లేషకులు.