చదువుకున్న వాళ్లే.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు : సైబరాబాద్ పోలీస్
సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడే వారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదివిన వారే ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
సైబర్ నేరగాళ్లు ఎప్పుడు.. ఎలా అటాక్ చేస్తారో అర్థం కాదు. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ఫోన్లు, ఈ-మెయిల్స్‌లో వచ్చే ఫిషింగ్ లింక్స్‌ను క్లిక్ చేయవద్దని.. అనామకులు కాల్ చేస్తే ఓటీపీ, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు చెప్పవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా పాన్ కార్డ్, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలంటూ కొంత మంది కాల్ చేసి.. ఓటీపీ అడిగిన వెంటనే చెప్పేస్తే.. లక్షలాది రూపాయలు బ్యాంక్ నుంచి కొల్లగొడుతున్నారు. ఇటీవల ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజరే పాన్ కార్డ్ అప్డేట్ మోసంలో ఇరుక్కొని దాదాపు రూ.2 లక్షల వరకు నష్టపోయాడు. పోలీసులు సైబర్ నేరాల విషయంలో ఎన్ని మార్లు అవగాహన కల్పించినా.. పదే పదే మోసపోతూనే ఉన్నారు.
హైదరాబాద్ నగరంలో కూడా సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడే వారిలో అత్యధికంగా ఉన్నత చదువులు చదివిన వారే ఉన్నట్లు సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. 2022లో జరిగిన సైబర్ నేరాలకు సంబంధించిన డేటాను పరిశీలించినప్పుడు విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. నిరుడు ఐటీ జోన్, గచ్చిబౌలి, మాధాపూర్ ప్రాంతాల్లో నివసిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న 2,400 మంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. ఈ బాధితుల నుంచి సైబర్ నేరగాళ్లు దాదాపు రూ.20 కోట్లను కొల్లగొట్టారు. మోసపోయిన వారిలో చాలా మంది ఐటీ ఉద్యోగులు కూడా ఉండటం గమనార్హం.
మాధాపూర్ పోలీసులు ఈ సైబర్ నేరాలపై విశ్లేషణ చేయగా.. గతేడాది 2,400 మంది మోసగించబడినట్లు తెలుస్తోంది. వీరందరూ ఉన్నత విద్యను అభ్యసించిన వాళ్లే అని పోలీసులు చెబుతున్నారు. డేటా ప్రకారం... మోసపోయిన వారిలో 1,143 మంది ప్రైవేట్ ఉద్యోగులు.. 308 మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీళ్లతో పాటు 171 మంది విద్యార్థులు, 141 మంది వ్యాపారులు, 123 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 42 మంది డాక్టర్లు, 58 మంది విశ్రాంత ఉద్యోగులు, 115 మంది గృహిణులు ఉన్నట్లు మాధాపూర్ డీసీపీ కే. శిల్పవల్లి తెలిపారు.
సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడిన వీళ్లందరూ కనీసం డిగ్రీ పూర్తి చేసిన వారే అని.. ఇలాంటి ఉదంతాలు జరుగుతున్నాయని తెలిసిన ఐటీ ఎంప్లాయిస్ కూడా మోసపోవడం ఆశ్చర్యంగా ఉందని డీసీపీ అన్నారు. మొబైల్, ఈ-మెయిల్స్‌లో అడ్వర్టైజింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్ ప్లాట్‌ఫామ్స్, హౌసింగ్ రెంటల్స్, క్యూఆర్ కోడ్ స్కానింగ్, పార్ట్‌టైం జాబ్స్ పేరుతో వచ్చే లింక్స్ వల్లే ఎక్కువ మంది మోసపోయినట్లు పోలీసులు తేల్చారు. ఇలాంటి కాల్స్, లింక్స్‌ను నమ్మవద్దని.. 90 శాతం మేరకు అవన్నీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడేస్తాయని డీసీపీ అన్నారు.