షెడ్యూల్ విడుదలయ్యే రోజే కలకలం.. కరీంనగర్ లో రూ.6.67 కోట్లు సీజ్
ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దశలో సోదాలు జరగడం, నగదు పట్టుబడటంతో కరీంనగర్ జిల్లాలో కలకలం రేగింది.

కరీంనగర్‌లో భారీగా నగదు పట్టుబడింది. పట్టణంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ హోటల్‌లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. రూ.6.67 కోట్లు సీజ్ చేశారు. నగదుకు సంబంధించిన సరైన పత్రాలు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న సొమ్ముని కోర్టులో డిపాజిట్ చేస్తామని చెప్పారు పోలీసులు.
కరీంనగర్ లో నగదు దొరికిన ప్రతిమ మల్టీప్లెక్స్.. మాజీ ఎంపీ, ప్రస్తుత బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థి వినోద్ కుమార్ కి చెందినదిగా చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకొంది. బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ సోదాలు జరుగుతున్నాయనే ప్రచారం మొదలైంది. అయితే ఆ నగదుకి బీఆర్ఎస్ కి ఎలాంటి సంబంధం లేదని మరికొందరు అంటున్నారు. బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఎన్నికల సీజన్ లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడటంతో పలు అనుమానాలు మొదలయ్యాయి. అందులోనూ ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదలకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దశలో సోదాలు జరగడం, నగదు పట్టుబడటంతో కరీంనగర్ జిల్లాలో కలకలం రేగింది. లోక్ సభ ఎన్నికల మూడ్ మొదలైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడటం ఇదే తొలిసారి.