జలదిగ్బంధంలో మోరంచపల్లి.. హెలికాప్టర్లతో బాధితుల తరలింపు
సాధారణ హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టడం కష్టసాధ్యమని తేలడంతో.. ఆర్మీ సహాయం కోరింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు.
తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దాదాపుగా చాలా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బయటకు వెళ్దామన్నా దారిలేని పరిస్థితి కొన్నిచోట్ల ఉంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి కూడా ఇలానే జలదిగ్బంధంలో చిక్కుకుంది. అయితే మిగతా గ్రామాలతో పోల్చి చూస్తే ఇక్కడ పరిస్థితి అంతకంతకూ ప్రమాదకరంగా మారుతోంది. గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నారు. ఎత్తయిన మిద్దెలు ఎక్కి ప్రాణాలు కాపాడుకొంటున్నారు. వారిని తరలించడం ఇప్పుడు అధికారులకు సవాలుగా మారింది.
మోరంచవాగు ఉగ్రరూపం దాల్చడంతో భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. మోరంచపల్లి గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. గ్రామస్తులు బయటకు వెళ్లేందుకు అవకాశమే లేదు. లారీలు కూడా నీట మునిగిపోయాయి. ఈ సమాచారం తెలుసుకున్న సీఎం కేసీఆర్.. వెంటనే హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మోరంచపల్లి వాసులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకూడదని ఆదేశాలిచ్చారు.
రంగంలోకి ఆర్మీ హెలికాప్టర్లు..
సాధారణ హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టడం కష్టసాధ్యమని తేలడంతో.. ఆర్మీ సహాయం కోరింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ మిలటరీ అధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సైన్యం అంగీకారం తెలపడంతో ఆర్మీకి చెందిన రెండు హెలికాప్టర్లను మోరంచపల్లికి పంపిస్తున్నామని సీఎస్ శాంతికుమారి తెలిపారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. అవసరమైన చోట హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని అందిస్తామన్నారు.