Telugu Global
Telangana

హస్తినకు పైసలు పంపడానికే మూసీ, హైడ్రా

మూసీలో రంగుల కల చూపించి ఏదో చేసినట్లు చూపించి లక్షా యాభై వేల కోట్లు దోపిడీ చేయాలనుకుంటున్న రేవంత్‌ అని కేటీఆర్‌ ఆరోపణ

హస్తినకు పైసలు పంపడానికే మూసీ, హైడ్రా
X

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ మురికి కూపంగా మారటానికి గత పాలకులే కారణం అన్నారు. ఆయన అన్న మాటలను నేను ఏకీభవిస్తున్నా. కాంగ్రెస్, టీడీపీ లు ఉన్నప్పుడే మూసీ మురికి కూపంగా మారిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి నాగోల్‌లోని ఎస్టీపీ కేంద్రాన్ని కేటీఆర్‌ పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ..హైదరాబాద్ కు మూసీ ఒక వరం. నాగోల్ లో నిర్మించిన ఎస్టీపీ దేశంలోనే అతిపెద్ద మురుగు నీటి శుద్ది కేంద్రం అని తెలిపారు. కేసీఆర్ ఎస్టీపీలు నిర్మించటంతో మురుగు నీరు శుద్ది నీరుగా మారుతున్నది. గతంలో ఎంతో మురికిగా ఉన్న మూసీ నీళ్లను పూర్తిగా స్వచ్ఛమైన నీళ్లుగా మార్చామన్నారు. 90 శాతం వాన నీళ్లు గ్రావిటీ ద్వారానే మూసీలోకి చేరుతాయి. 2015 లో సెంట్రల్ పొలుష్యన్ బోర్డు మూసీ అతి కాలుష్యమైన నది అని రిపోర్ట్ ఇచ్చారు. అంటే అప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్, టీడీపీ లే మూసీని పాడు చేశాయని ధ్వజమెత్తారు. కానీ కేసీఆర్ మాత్రం మూసీకి పునర్ వైభవం తేవాలని భావించారు. మూసీని బాగుచేయాలంటే ముందు నీళ్లను బాగు చేయమని మాకు చెప్పారు. మేము అధికారంలోకి వచ్చే నాటికి హైదరాబాద్ లో 700 ఎంఎల్డీ ల శుద్ది కేంద్రాలు మాత్రమే ఉండేవి. కానీ మా అధినేత ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో రూ. 3,866 కోట్లతో మేము 31 ఎస్టీపీలను నిర్మించాలని నిర్ణయించాం. ఫలితంగా మూసీ లో మురికి నీళ్ల శుద్ది పెద్ద ఎత్తున జరుగుతున్నాయన్నారు.

మురికి నీళ్లు మీరు పంపితే మేము మంచి నీళ్లను పంపుతున్నాం

గతంలో కాంగ్రెస్ నల్గొండకు మురికి నీళ్లను పంపిస్తే...మేము మాత్రం ఈ విధంగా మంచి నీళ్లను పంపిస్తున్నామని చెప్పారు.మేము పూర్తి స్థాయిలో చేసిన పనులను రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకుంటున్నాడు. మేము కట్టిన ఇళ్లకు సున్నం వేసి గుంపు మేస్త్రి నేనే కట్టిన అని చెప్పుకుంటున్నాడని డని ఎద్దేవా చేశారు. అదృష్టం బాగుండి ఆయన టైమ్ నడుస్తోంది. మూసీలో నీళ్లు చాలా వేగంగా జారి కిందకు పోతాయి. దీనివల్ల మంచి ఉంది. చెడు ఉంది. దానికి అనుగుణంగా నీళ్లను నిలపటానికి మూసీపై 15 బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించాం. హైదరాబాద్ నిర్మాణం జరిగిన తర్వాత మళ్లీ మూసీ పై బ్రిడ్జిలు నిర్మించాలని మేము భావించాం. హైదరాబాద్ వారసత్వ సంపద పరిరక్షించే విధంగా బ్రిడ్జిలను నిర్మించాలని డిజైన్ లకు కూడా అదే విధంగా ఉండేలా చూసుకున్నాం. బ్రిడ్జిల కోసం దాదాపు 5 వందల కోట్లు కేటాయించాం. దానితో పాటు చెక్ డ్యామ్ లను కూడా నిర్మించాలని భావించామన్నారు.

పైసలు ఎత్తుకుపోయి...ఢిల్లీ వాళ్లకు ఇచ్చి పదవికి కాపాడుకోవాలని

అదే విధంగా కొండ పోచమ్మ ప్రాజెక్ట్ ద్వారా గోదావరి నీళ్లను మూసీ నదికి అనుసంధానం చేయాలని నిర్ణయించాం. 2023 మే 18 నాడు 11 వందల కోట్లతో గోదావరి నీళ్లను మూసీకి అనుసంధానం చేసే పనిచేశామని చెప్పారు. ఎస్టీపీలు, బ్రిడ్జిలు, గోదావరి నీళ్లను అనుసంధానం అంటూ మూసీ పునరుజ్జీవనం చేశాం. కొత్తగా సీఎం పునరుజ్జీవనం అంటే ఆయనే కనిపెట్టినట్లు చెబుతున్నాడో అవి పచ్చి బోగస్ మాటలన్నారు. మూసీ పేరుతో ప్రజాధనం లూటీ చేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. లక్షా 50 వేల కోట్లు అంటున్నాడు.సుధీర్ రెడ్డి ఛైర్మన్ గా ఉన్నప్పుడే మేము దాదాపుగా పనులు చేశామని వివరించారు. మంచి రేవుల నుంచి ప్రతాప సింగారం వరకు ఎక్స్ ప్రెస్ హై వే కూడా కట్టాలని భావించాం. 57 కిలోమీటర్లకు దానికోసం ఖర్చు అయ్యేది రూ. 10 వేల కోట్లే అన్నారు. ఎస్టీపీలు, బ్రిడ్జిలు, ఎక్స్ ప్రెస్ హై వే లు, గోదావరి నీటి అనుసంధానానికి మేము రూ. 15 వేల కోట్లు అంచనా వేశాం. సరే దానికి మరో రూ. 10 వేల కోట్లు ఎక్కువ చేసిన సరే రూ. 25 వేల కోట్లతో ప్రాజెక్ట్ పూర్తి అవుతుందన్నారు. అయితే మూసీ ప్రాజెక్ట్ కు ఎంతో ఖర్చు చేస్తారో వాళ్లకే తెలియటం లేదు.ఇదే రేవంత్ రెడ్డి ఏప్రిల్ లో రూ. 50 వేల కోట్లు అన్నాడు. జీహెచ్ఎంసీ వాళ్లు రూ. 60 వేల కోట్లు అన్నారు. జూపల్లి కృష్ణారావు ఏమో రూ. 70 వేల కోట్లు అన్నాడు. ఆ తర్వాత ఇదే ముఖ్యమంత్రి మళ్లీ రూ. లక్షా 50 వేల కోట్లు అంటాడు. మళ్లీ లక్షా 50 వేల కోట్లు ఎవరన్నారు అంటాడు.మొత్తం రూ. 25 వేల కోట్లతో మంచిగా పూర్తి చేసే ప్రాజెక్ట్ కు రూ. లక్షా యాభై వేల కోట్లు కావాలంట. కాంగ్రెస్ పార్టీకి దేశంలో పరిస్థితి మంచిగా లేదు. వాళ్లకు పైసలు తెలంగాణ నుంచే కావాలె. రేవంత్ రెడ్డి మాత్రమే పైసలు ఇస్తున్నాడు. కర్ణాటక, తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కర్ణాటకలో ముఖ్యమంత్రి ముడా అనే స్కాం లో ఇరుక్కున్నాడు. ఇప్పుడు మహారాష్ట్ర, జార్ఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. రాహుల్ గాంధీకి పైసలు కావాలె. మరి దానికి పైసలు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి మూసీ ఒకటి, హైడ్రా అని రెండు పట్టుకున్నాడు.ఢిల్లీ కి మూటలు మోయాలంటే హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి పైసలు తీసుకోవాలె. మూసీలో రంగుల కల చూపించి ఏదో చేసినట్లు చూపించి లక్షా యాభై వేల కోట్లు దోపిడీ చేయాలె. ఇక్కడి నుంచి పైసలు ఎత్తుకుపోయి...ఢిల్లీ వాళ్లకు ఇచ్చి పదవికి కాపాడుకోవాలని కేటీఆర్‌ ఆరోపించారు.

మూడు నెలలు కాదు మూడేండ్లు ఉంటా

రూ. 25 వేల కోట్ల రూపాయలతో మూసీని పూర్తిగా ప్రక్షాళన చేయవచ్చు. అదే కేసీఆర్ మూసీ సుందరీకరణ చేయాలని భావించినప్పుడు ముందు ఎస్టీపీలు నిర్మాణం చేయాలని చెప్పారు. బఫర్ లో 11 వేల ఇళ్లు ఉన్నాయి. వాళ్లను కబ్జాదారులంటూ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇది దుర్మార్గమని ధ్వజమెత్తారు. వాళ్లకు పర్మిషన్లు ఇచ్చి వాళ్ల నుంచి ట్యాక్స్ లు వసూలు చేసి ఇప్పుడు వాళ్లను కబ్జాదారులు అంటారా? ముఖ్యమంత్రి గా అయినప్పటికీ రేవంత్ రెడ్డికి ఇంకా ఆ హుందాతనం రాలేదు.మూసీ దగ్గర నన్ను నాలుగు నెలలు ఉండమని సీఎం వెటకారంగా అంటున్నాడు. మూసీ దగ్గర ఉన్నవాళ్లే 60, 70 ఏళ్లుగా అక్కడ ఉంటున్నామని చెబుతున్నారు.. మేము మంచిగానే ఉన్నామని చెబుతున్నారు. అక్కడ ఉన్నవాళ్లు ఈఎంఐ లు ఏ విధంగా కట్టాలని ఓ మహిళ పాపం ఏడుస్తోంది. దీనికి వెటకారంగా మాట్లాడే రేవంత్ రెడ్డి సమాధానం చెబుతాడా? అని ప్రశ్నించారు.మూసీ లో ఇళ్లు కోల్పోయేటోళ్ల కోసం మూడు నెలలుగా కాదు. మూడు సంవత్సరాలు ఉంటా. నేను చిన్నప్పుడు నింబోలి అడ్డా, మొజాంజాహీ మార్కెట్ వద్ద ఉన్నా. అది మూసీకి చాలా దగ్గర అన్నారు. రేవంత్ రెడ్డి గనీకు పైసలు కావాలంటే మేము చందాలు వేస్తాం. ఢిల్లీకి పంపించి నీ సీటు కాపాడుకో అంతేగాని కానీ పేదల కడుపు కొట్టి వేల కోట్లు దోపీడి చేస్తామంటే ఒప్పుకోమని హెచ్చరించారు.

మూసీ బ్యూటీఫికేషన్ కు కాదు లూటీఫికేషన్ కు వ్యతిరేకం

సబర్మతి నది ప్రక్షాళన కు 14 కిలోమీటర్లకు రూ. 7 వేల కోట్లు అయ్యింది. సరే దానికి మూడు రెట్లు ఎక్కువ వేసుకోవచ్చు.రేవంత్ రెడ్డి బడేభాయ్ మోడీ నమామీ గంగా ప్రాజెక్ట్ లో కిలోమీటర్ కు రూ. 17 కోట్లు ఖర్చు చేసింది. ఇక్కడ 57 కిలోమీటర్లకు మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తా అంటాడు. కిలోమీటర్ కు రూ. 2700 కోట్లు ఖర్చు పెడతా అంటాడు. లక్ష మందిని రోడ్డుపై వేస్తూ, వేల కోట్ల రూపాయలు దోచుకుంటామంటే దానికి మేము మద్దతు ఎలా తెలుపాలి? రుణమాఫీ, సంక్షేమ పథకాలు, చాక్ పీస్, మందులకు పైసలు లేవు. జీతాలు ఇచ్చేందుకు పైసల్ లేవు. ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు పైసలు లేవు. దేనికి పైసలు లేవు.కానీ మూసీ కోసం మాత్రం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేసేందుకు మాత్రం ఉన్నాయంట. మేము మూసీ బ్యూటీఫికేషన్ కు వ్యతిరేకం కాదు. దాని పేరుతో జరిగే లూటీఫికేషన్ కు మాత్రం మూమ్మటికి వ్యతిరేకం. మూసీ పేరుతో జరిగే మూటల దోపిడీకి కచ్చితంగా వ్యతిరేకం.అవసరమైతే రెండు దిక్కుల కరకట్టలు కట్టు, ఎవ్వరికి నష్టం చేయకు, బఫర్ జోన్ జోలికి వెళ్లకు. నది గర్భంలో పేదల ఇళ్లు ఉంటే మంచిది కాదంట. కానీ బస్టాండ్, మెట్రో స్టేషన్ ఉంటుందంట. పేదల ఇళ్లు కూల్చేసి...పెద్ద మాల్స్ కడితే మాత్రం మంచిదంట.మేము పునరుజ్జీవం చేసింది వాస్తవం. కొత్తగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నది వాస్తవం. మూసీ లో దోపిడీ జరుగుతుందన్నది వాస్తవం అన్నారు.

రేవంత్ రెడ్డికి ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇళ్లే దిక్కు

మూసీలో ఇళ్లు కోల్పోయే వారికి మేమే అండగా ఉంటాం. వారి తరఫున న్యాయ పోరాటం చేస్తాం. మన హక్కుల గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి. ఎవరు పడితే వాళ్లు వచ్చి బస్సు ఎక్కు అంటే మనం గొర్రెలం కాదన్నారు. డీపీఆర్ లేకుండా మమ్మల్ని ఎలా ఖాళీ చేయమంటావని మనం ప్రశ్నించాలి. మీ తరఫున రాజ్యాంగ, న్యాయపరంగా, రక్షణ పరంగా మేము అండగా ఉంటాం. తెల్లారి లేస్తే కేసీఆర్ ను తిట్టే రేవంత్ రెడ్డికి ఇప్పుడు కేసీఆర్ కట్టిన ఇళ్లు...కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లే దిక్కు అయినయ్. గోదావరి నీళ్లు, ఎస్టీపీలను పూర్తి చేసింది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. మూసీ పేరిట జరుగుతున్న లూటీఫికేషన్ కు చరమగీతం పాడాలి. వ్యతిరేకంగా పోరాడాలి.ఎస్ఎన్డీపీ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ లో వర్షం నీళ్లు నిలవటం లేదు. ఎస్ఎన్టీపీ ద్వారా జరిగిన ప్రయోజనాన్ని ప్రజలకు మేమే వివరిస్తాం. వాటిని కూడా సందర్శిస్తామన్నారు. ప్రజలకు చేసిన మంచి పనులను మేమే చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

First Published:  19 Oct 2024 12:59 PM IST
Next Story