Telugu Global
Telangana

తెలంగాణలో మంకీపాక్స్..? కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి లక్షణాలు..

కామారెడ్డి ఇందిరానగర్ కి చెందిన 40 ఏళ్ల ఓ వ్యక్తి కువైట్ లో ఉంటున్నాడు. ఈనెల 6న కువైట్ నుంచి తిరిగొచ్చాడు. వారం రోజులపాటు అంతా బాగానే ఉంది, ఆ తర్వాత జ్వరం మొదలైంది.

తెలంగాణలో మంకీపాక్స్..? కువైట్ నుంచి వచ్చిన వ్యక్తికి లక్షణాలు..
X

కేరళలో మూడు కేసులు, ఢిల్లీలో ఒక కేసు కన్ఫామ్. నాలుగో కేసు తెలంగాణలో ఉందా..? అనుమానితుడి రిజల్ట్ ఎప్పుడొస్తుంది..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. కామారెడ్డి పట్టణంలో ఓ వ్యక్తికి మంకీపాక్స్ లక్షణాలున్నాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించడంతో కలకలం మొదలైంది. కువైట్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలిస్తున్నారు అధికారులు.

కామారెడ్డి ఇందిరానగర్ కి చెందిన 40 ఏళ్ల ఓ వ్యక్తి కువైట్ లో ఉంటున్నాడు. ఈనెల 6న కువైట్ నుంచి తిరిగొచ్చాడు. వారం రోజులపాటు అంతా బాగానే ఉంది, ఆ తర్వాత జ్వరం మొదలైంది. ఈనెల 20వ తేదీన జ్వరం తీవ్రమైంది, మందులు వాడుతున్నా తగ్గలేదు, 23వ తేదీన చర్మంపై దద్దుర్లు బయటపడ్డాయి. దీంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరాడు. మంకీపాక్స్ లక్షణాలు ఉండటంతో వైద్యులు ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. ప్రభుత్వ వైద్యులు అతనివద్ద శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి పంపించారు. బాధితుడిని కామారెడ్డిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంకీపాక్స్ నిర్ధార‌ణ కోసం అతడి శాంపిల్స్ ని పూణేలోని వైరాలజీ ల్యాబ్ కి పంపిస్తున్నామని, బాధితుడిని హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రికి తరలిస్తామని తెలిపారు అధికారులు.

కువైట్ నుంచి వచ్చిన వ్యక్తితో సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యుల విషయంలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆరుగురు కుటుంబ సభ్యులను ఐసోలేషన్లో ఉంచి పరీక్షిస్తున్నారు. వారిలో ఏ ఒక్కరికీ మంకీపాక్స్ లక్షణాలు లేవని నిర్ధారించారు. అయితే ప్రైమరీ కాంటాక్ట్స్ కావడంతో ముందు జాగ్రత్తగా వారిని ఐసోలేషన్లో ఉంచామని తెలిపారు అధికారులు. ప్రజలు మంకీపాక్స్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ప్రాణాంతక వ్యాధి కాదంటూ తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

First Published:  25 July 2022 7:31 AM IST
Next Story