బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ.. ఎవరు పంపారో తెలియక తికమక!
దాదాపు 50 మందికి శనివారం రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.2 లక్షలు ఇలా జమయ్యాయి. దీంతో చాలా మంది యూపీఐ యాప్స్ ఉపయోగించి వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు.
వారంతా సామాన్యులు.. చిన్న వ్యాపారులు, నిరుద్యోగులు, రైతులు. కానీ అకస్మాతుగా వారి అకౌంట్లలోకి డబ్బులు జమయ్యాయి. తమకు డబ్బు ఇవ్వాల్సిన వ్యక్తులు ఎవరూ లేరు. అలాగే ప్రభుత్వం నుంచి పథకాల ద్వారా అందాల్సిన డబ్బు కూడా ఏమీ లేదు. కానీ అకౌంట్లలో డబ్బు జమ కావడంతో ఆశ్చర్యపోయారు. ఇలా ఒకరిద్దరి కాదు.. ఏకంగా 50 మందికికి రూ.2 వేల నుంచి రూ.2 లక్షల వరకు జమయ్యాయి.
ములుగు జిల్లాలోని దాదాపు 50 మందికి శనివారం రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేలు, రూ.2 లక్షల చొప్పున జమయ్యాయి. దీంతో చాలా మంది యూపీఐ యాప్స్ ఉపయోగించి వేరే ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో ఒకే వీధికి చెందిన ముగ్గురికి శనివారం ఇలా డబ్బు జమయ్యింది. అసలు ఎవరు పంపారో? ఎక్కడి నుంచి వచ్చాయో? వారికి అర్థం కాలేదు. పొరపాటున పడితే వెనక్కి తీసుకుంటారేమో అనుమానంతో కొంత మంది వేరే అకౌంట్లలోకి బదిలీ చేసుకున్నారు.
ఏటూరునాగారానికి చెందిన ఎస్బీఐ, పీఎన్‌బీ, ఏపీజీవీబీ, కెనరా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఖాతాదారులకే ఇలా జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా శనివారం (26 ఆగస్టు) నాలుగవ శనివారం కావడంతో ఆయా బ్యాంకులకు సెలవు. దీంతో బ్యాంకుకు వెళ్లి కనుక్కోవడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. కాగా, ఆ నోటా ఈ నోటా విషయం పోలీసుల వరకు చేరింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, ఇంటెలిజెన్స్ వర్గాలు డబ్బులు జమ అయిన ఖాతాదారుల వద్దకు వెళ్లి ఆరా తీశారు.
డబ్బులు పడితే వాటని వాడుకోవద్దని.. సోమవారం బ్యాంకు అధికారులను సంప్రదించి అసలు విషయం తేలుస్తామని పోలీసులు ఖాతాదారులకు చెప్పారు. ఆ డబ్బులు తిరిగి వెనక్కు తీసుకుంటారని.. అందుకే డబ్బులు ఎవరూ వాడుకోవద్దని పోలీసులు సూచించారు.