Telugu Global
Telangana

మోదీ వ్యాఖ్యలతో నష్టం.. కిషన్ రెడ్డి కవరింగ్ కష్టాలు

సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మోదీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ కిందామీదా పడుతోంది. మోదీ వ్యాఖ్యలకు అర్థాలు, పరమార్థాలు వెదికే పనిలో పడింది.

మోదీ వ్యాఖ్యలతో నష్టం.. కిషన్ రెడ్డి కవరింగ్ కష్టాలు
X

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా తెలంగాణ ఏర్పాటుని కించపరిచేలా మాట్లాడారు ప్రధాని నరేంద్రమోదీ. బీఆర్ఎస్ నేతలతో సహా తెలంగాణవాదులంతా ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. అసలు పార్లమెంట్ లో విభజన ప్రస్తావన తేవాల్సిన సందర్భమేంటని ప్రశ్నించారు. పైగా విభజనతో రెండు రాష్ట్రాలు సంతోషంగా లేవనే అపవాదు వేయడమేంటని, పోనీ కష్టనష్టాలుంటే ఈ తొమ్మిదిన్నరేళ్లలో రెండు రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయొచ్చుగా అని లాజిక్ తీశారు. తెలంగాణ ఎన్నికల వేళ మోదీ వ్యాఖ్యలు ఆ పార్టీకి తీరని నష్టం కలిగిస్తాయనే అంచనాలు మొదలయ్యాయి. ఈ దశలో కిషన్ రెడ్డి నష్టనివారణ చర్యలకు దిగారు. మోదీ వ్యాఖ్యలను కవర్ చేస్తూ ఆయన క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ ఏర్పాటుపై మోదీ స్పందించడానికి సరైన కారణం ఉందన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ తలుపులు మూసివేశారని, పెప్పర్ స్ప్రే కూడా వాడారని, అలాంటి పరిస్థితుల్లో విభజన జరిగిందని అన్నారాయన. పాత పార్లమెంట్‌లో చోటు చేసుకున్న చారిత్రక ఘట్టాల గురించి చెబుతూ మోదీ ఏపీ విభజన గుర్తు చేశారన్నారు. తెలంగాణను ఇచ్చింది తామేనని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు కానీ, ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించారని కిషన్ రెడ్డి తెలిపారు.

రాష్ట్రాల విభజన విషయంలో బీజేపీ సమర్థంగా పనిచేసిందని, కాంగ్రెస్ ఏపీని విభజించిన తీరు సరిగ్గా లేదు అని మోదీ చెప్పాలనుకున్నారు. కాంగ్రెస్ ని తప్పుబట్టాలని చూశారు. కానీ సీన్ రివర్స్ అయింది. సమయం, సందర్భం లేకుండా తెలంగాణ ఏర్పాటుని ఆయన కించపరిచేలా మాట్లాడారు. దీంతో తెలంగాణ సమాజం తిరగబడింది. అది కూడా సరిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మోదీ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. దీంతో తెలంగాణ బీజేపీ కిందామీదా పడుతోంది. మోదీ వ్యాఖ్యలకు అర్థాలు, పరమార్థాలు వెదికే పనిలో పడింది.

First Published:  19 Sept 2023 5:52 AM IST
Next Story