Telugu Global
Telangana

మునుగోడులో బీజేపీ అస్త్ర సన్యాసం.. ప్రచారానికి హైకమాండ్ దూరం

అవసరం ఉన్నా లేకున్నా పదే పదే తెలంగాణకు వచ్చే బీజేపీ నేతలు, మంత్రులు.. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా మునుగోడుకి వచ్చే సాహసం చేయడం లేదు.

మునుగోడులో బీజేపీ అస్త్ర సన్యాసం.. ప్రచారానికి హైకమాండ్ దూరం
X

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాన్ని బీజేపీ ముందుగానే అంచనా వేసింది. అక్కడ ప్రచారం చేసి కూడా ఉపయోగం లేదని భావిస్తున్నారు బీజేపీ నేతలు. అందుకే అగ్రనాయకత్వం ప్రచారానికి పూర్తిగా దూరమైంది. అవసరం ఉన్నా లేకున్నా పదే పదే తెలంగాణకు వచ్చే బీజేపీ నేతలు, మంత్రులు.. ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా మునుగోడుకి వచ్చే సాహసం చేయడం లేదు.

ఆమధ్య హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో వచ్చే ఏడాది బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని గొప్పలు చెప్పుకున్నారు. పార్టీ బలోపేతం కోసం తాను నెలకు 2 సార్లు తెలంగాణకు వస్తానని భరోసా ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు అమిత్ షా జాడే లేదు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ కండువా కప్పేందుకే ఆయన మునుగోడు వచ్చారు. ఆ తర్వాత పత్తా లేకుండా పోయారు.

ద్వయానికి భయమా..?

మోదీ-షా ద్వయం ఎక్కడికి వస్తే అక్కడ విజయం వరిస్తుందని బీజేపీ సెంటిమెంట్. అలాంటిది మునుగోడుకి మోదీ రాలేదు, షా రావట్లేదు... ఎందుకనే అనుమానం బీజేపీ నేతలకు కూడా వచ్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేసిన ఈ ద్వయం మునుగోడుని వ్యూహాత్మకంగా ఎందుకు పక్కనపెట్టిందనేదే ఇప్పుడు చర్చనీయాంశం. ఓటమి భయంతో వారు మునుగోడుకి రావట్లేదు. సర్వేలన్నీ పూర్తి వ్యతిరేకంగా రావడంతో మునుగోడుకి వెళ్లి పరువు పోగొట్టుకోవడం ఎందుకని వెనకడుగేశారు కీలక నేతలు. అటు రాజగోపాల్ రెడ్డికి కూడా ప్రచారంలో వరుసగా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అలాంటివి మోదీ, షా లాంటి వారికి కూడా ఎదురైతే దేశవ్యాప్తంగా అది చర్చనీయాంశమవుతోంది. ఈ ఇబ్బందికర పరిస్థితిని ఊహించే వారు ప్రచారానికి రావట్లేదు.

కండువాలకు తగ్గిన డిమాండ్..

మోదీ, షా.. ఆ స్థాయి నేతలు ప్రచారానికి వచ్చారంటే, మినిమమ్ ఎమ్మెల్యే స్థాయి ఉన్న నేతలెవరైనా పార్టీలో చేరితే ఆ కార్యక్రమానికి క్రేజ్ వస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా రివర్స్ లో ఉంది. మోదీ ఇటు మీటింగ్ పెడితే, అటు కీలక నేతలు బీజేపీకి గుడ్ బై చెప్పేలా ఉన్నారు. ఇప్పటికే చాలామంది చెప్పేశారు కూడా. ఈ దశలో కనీసం కండువాలకి కూడా పనిలేదు కాబట్టి వారెవరూ ఇటువైపు కన్నెత్తి చూడటంలేదు. మొత్తమ్మీద మునుగోడులో గెలిస్తే అది బీజేపీ గొప్పతనం అని చెప్పుకోవాలనుకున్నారు, ఇప్పుడు ఓటమి ఖాయమైంది కాబట్టి దీన్ని పూర్తిగా రాజగోపాల్ రెడ్డి ఖాతాలోకి తోసేయాలని చూస్తున్నారు.

First Published:  27 Oct 2022 11:51 AM IST
Next Story