Telugu Global
Telangana

తెలంగాణలోని 21 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ

తెలంగాణ రాష్ట్రంలోని 21 స్టేషన్లలో ఆరు రైల్వే స్టేషన్లు హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నాయి.

తెలంగాణలోని 21 రైల్వేస్టేషన్లకు మహర్దశ.. రేపు శంకుస్థాపన చేయనున్న ప్రధాని మోడీ
X

దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని 50 రైల్వే స్టేషన్లలో మౌలిక వసతులను మెరుగు పరిచి, అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అమృత్ భారత్ స్టేషన్ల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 1,309 స్టేషన్లలను అభివృద్ధి చేస్తుండగా.. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 21 కేటాయించారు. దేశవ్యాప్తంగా తొలి దశలో 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులకు ఆదివారం (ఆగస్టు 6) నాడు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ పద్దతిలో శంకుస్థాపన చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోని 21 స్టేషన్లలో ఆరు రైల్వే స్టేషన్లు హైదరాబాద్ నగర పరిధిలో ఉన్నాయి. హైదరాబాద్, హఫీజ్‌పేట్, హైటెక్ సిటీ, మలక్‌పేట్, మల్కాజ్‌గిరి, ఉప్పుగూడ స్టేషన్లలను అమృత్ స్టేషన్ల ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రంలోని 21 స్టేషన్ల కోసం మొత్తం రూ.894.09 కోట్లు కేటాయించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మొత్తం 50 స్టేషన్లను ఈ పథకంలో భాగంగా చేర్చగా.. అందులో 36 స్టేషన్లు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి.

అమృత్ భారత్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం మెరుగైన వసతులు కల్పించనున్నారు. రైల్వే స్టేషన్‌లోకి వెళ్లడానికి అత్యాధునిక మార్గాలు, స్టేషన్‌లో మెరుగైన వెలుతురు కోసం అత్యాధునిక లైట్లు, గాలి సహజంగా వీచేలా నిర్మాణాలు, దివ్యాంగులు ఎలాంటి ఇబ్బంది పడకుండా రైలు ఎక్కడానికి సౌలతులు కల్పించనున్నారు. అమృత్ భారత్ స్టేషన్లు ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తెలిపారు.

అమృత్ భారత్ స్టేషన్లను మోడ్రన్ అర్కిటెక్చర్ పద్దతిలో, వరల్డ్ క్లాస్ సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారు. తెలంగాణలోని 21 స్టేషన్లను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయనున్నట్లు అరుణ్ కుమార్ వెల్లడించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ.. త్వరగా ఈ స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూస్తామని అన్నారు.

తెలంగాణలో అభివృద్ధి చేయనున్న స్టేషన్లు ఇవే..

1. హైదరాబాద్ - రూ.309 కోట్లు

2. మలక్‌పేట్ - రూ.36.44 కోట్లు

3. ఉప్పుగూడ - రూ.26.81 కోట్లు

4. హఫీజ్ పేట్ - రూ.26.6 కోట్లు

5. హైటెక్ సిటీ - రూ.26.6 కోట్లు

6. మల్కాజ్‌గిరి - రూ.27.6కోట్లు

7. ఆదిలాబాద్ - రూ.17.8 కోట్లు

8. భద్రాచలం రోడ్ - రూ.24.5కోట్లు

9. జనగామ - రూ.24.5 కోట్లు

10. కామారెడ్డి - రూ.39.9కోట్లు

11. కరీంనగర్ - 26.6కోట్లు

12. ఖాజీపేట్ - రూ.24.5కోట్లు

13. ఖమ్మం - రూ.25.4కోట్లు

14. మధిర - రూ.25.4కోట్లు

15. మహబూబ్‌నగర్ - రూ.39.8కోట్లు

16. మహబూబాబాద్ - రూ.39.7కోట్లు

17. నిజామాబాద్ - రూ.53.3కోట్లు

18. రామగుండం - రూ.26.5కోట్లు

19. తాండూర్ - రూ.24.4కోట్లు

20. యాదాద్రి - రూ.24.5కోట్లు

21. జహీరాబాద్ - రూ.24.4కోట్లు

First Published:  5 Aug 2023 8:59 AM IST
Next Story