Telugu Global
Telangana

ఎన్నికల సభ కాదంటూనే మోదీ రాజకీయ విమర్శలు

ఆదిలాబాద్ నుంచి రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.

ఎన్నికల సభ కాదంటూనే మోదీ రాజకీయ విమర్శలు
X

ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల సభ కాదు, ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించలేదంటూనే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ని ఒకే గాటన కట్టే ప్రయత్నం చేశారు. కుటుంబ పార్టీలను నమ్ముకోవద్దని సూచించారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం.. ఇవే కుటుంబ పార్టీల్లో ఉంటాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని పాతపాటే పాడారు మోదీ. మేడిగడ్డ విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించిన కాంగ్రెస్ ఇప్పుడేం చేస్తోందని నిలదీశారు. మీరు తిన్నారంటే మీరు తిన్నారంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారని, చివరకు ఎవరిపై ఎవరు చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు మోదీ.


బీజేపీ రాకముందు ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి అవుతుందని ఎవరూ ఊహించలేదని, ఆఘనత తమ పార్టీదేనని చెప్పారు మోదీ. ఆదివాసీల ప్రగతి కోసం బీజేపీ సర్కార్ ఎంతో కృషి చేస్తోందన్నారు. దేశంలో వికాస ఉత్సవం జరుగుతోందని.. 15 రోజుల వ్యవధిలోనే రెండు ఐఐటీలు, ఒక ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎస్‌, పలు రైల్వే, రోడ్డు పనులు ప్రారంభించానని తెలిపారు. 15 రోజుల్లోనే ఆత్మనిర్భర్ భారత్ నుండి వికసిత్ భారత్ వైపు అడుగులు వేశామన్నారు మోదీ. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారాయన.

ఆదిలాబాద్ నుంచి రూ.7వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు, రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించారు. గత పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మంది భారతీయులు బయటపడ్డారని అన్నారు మోదీ.

First Published:  4 March 2024 1:32 PM IST
Next Story