Telugu Global
Telangana

పసుపు రైతులు తప్పకుండా మోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్తారు: మంత్రి కేటీఆర్

పసుపు రైతులను నిజంగా అవమానించింది ఎవరో తెలుసుకోవాలని ప్రధాని మోడీకి సూచించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని బాండు పేపర్లు రాసి మర్చి పోయింది బీజేపీ ఎంపీనే అని గుర్తు చేశారు.

KTR
X

KTR: పసుపు రైతులు తప్పకుండా మోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్తారు: మంత్రి కేటీఆర్

పసుపు రైతులు తప్పకుండా మోడీ ప్రభుత్వం చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. బీజేపీ నాయకులు కేవలం ప్రకటనలకే పరిమితం అవుతారని.. వారిది చేతల పార్టీ కాదని మంత్రి చెప్పారు. ఈ బాండ్ పేపర్ గుర్తుందా? తనను గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని.. లేదంటే పసుపు, ఎర్ర జొన్నలకు మద్దతు ధర తీసుకొని వస్తానని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రాసిన బాండ్ ఇది. తన హామీని నెరవేర్చకుంటే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొంటానని చెప్పారని కేటీఆర్ ట్విట్టర్‌లో గుర్తు చేశారు.

పసుపు బోర్డు తీసుకొని వస్తానని బాండ్ రాసి ఎంపీ అయిన ధర్మపుర అరవింద్ ఆ తర్వాత ఆ మాటే మర్చి పోయారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇలాంటి అబద్దపు హామీలు ఇచ్చి రైతులను ఏమార్చారు. రైతులు ఎన్నో ఆందోళనలు చేసినా పసుపు బోర్డు మాత్రం తీసుకొని రాలేకపోయారని కేటీఆర్ మండిపడ్డారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పీఎం మోడీ పసుపు రైతులను అవమానించారని ఆరోపించారు. కోవిడ్ పాండమిక్ సమయంలో పసుపు ఒక ఇమ్యూనిటీ బూస్టర్‌గా పని చేస్తుందని తాను చెబితే.. అందరూ హేళన చేశారని మోడీ చెప్పారు. ఇది తనను అవమానించడం కాదని, సాక్షాత్తు పసుపు రైతులను అవమానించడమే ప్రధాని మోడీ పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. అసలు పసుపు రైతులను నిజంగా అవమానించింది ఎవరో తెలుసుకోవాలని ప్రధాని మోడీకి సూచించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని బాండు పేపర్లు రాసి మర్చి పోయింది బీజేపీ ఎంపీనే అని గుర్తు చేశారు.


First Published:  8 May 2023 10:53 AM IST
Next Story