Telugu Global
Telangana

మోదీ గో బ్యాక్..! నిరసనల మధ్య నేడే ప్రధాని పర్యటన

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన వర్శిటీ వంటివి వట్టిమాటలేనని తేలిపోయిందని, కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ పేరుతో దగా చేయడానికి కూడా మోదీ వెనకాడ్డంలేదని అంటున్నారు తెలంగాణ నేతలు.

మోదీ గో బ్యాక్..! నిరసనల మధ్య నేడే ప్రధాని పర్యటన
X

మోదీ గో బ్యాక్ అంటూ ప్రధాని పర్యటనకు కొన్ని గంటల ముందే హనుమకొండలో భారీ ప్రదర్శన జరిగింది. ఏకశిలా పార్కు ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ తెలంగాణను మోసం చేశారని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వరంగల్ కు వస్తున్నారని నిలదీశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

మోదీ పర్యటనను తాము బహిష్కరిస్తున్నట్టు ఇప్పటికే బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఆహ్వానాలున్నా ఎవరూ ఆ కార్యక్రమానికి హాజరు కావట్లేదని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో వామపక్షాలు కూడా మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నిరసనలు చేపట్టాయి. తెలంగాణకు, ముఖ్యంగా వరంగల్ కు చేసిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ మోదీ రాకను వ్యతిరేకిస్తున్నారు.

కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన వర్శిటీ వంటివి వట్టిమాటలేనని తేలిపోయిందని, కోచ్ ఫ్యాక్టరీ బదులు వ్యాగన్ రిపేర్ ఫ్యాక్టరీ పేరుతో దగా చేయడానికి కూడా మోదీ వెనకాడ్డంలేదని అంటున్నారు తెలంగాణ నేతలు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై కక్షసాధింపు చర్యలు చేపట్టారని అంటున్నారు. మహారాష్ట్ర, గుజరాత్ లో వేల కోట్ల రూపాయలతో కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి, తెలంగాణకు కేవలం 521 కోట్ల రూపాయలు ముష్టి విదిల్చడం సరికాదంటూ మండిపడుతున్నారు నేతలు. మామునూర్‌ ఎయిర్‌ పోర్టును అభివృద్ధి పరచలేదని, గడిచిన 9 ఏళ్ల ఎన్డీఏ పాలనలో ఒక పరిశ్రమ కూడా వరంగల్‌ లో ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈరోజు మోదీ పర్యటన సందర్భంగా కూడా నిరసనలు చేపడతామని హెచ్చరించారు వామపక్ష నేతలు.

ఏర్పాట్లు పూర్తి..

అటు మోదీ పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హనుమకొండ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం అక్కడే బహిరంగసభలో మోదీ ప్రసంగిస్తారు. కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌ రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు మోదీ. అక్కడి నుంచి హెలికాప్టర్‌ లో బయలుదేరి వరంగల్‌ లోని మామునూరు ఎయిర్‌ స్ట్రిప్‌ లో దిగుతారు. భద్రకాళి అమ్మవారి దర్శనం అనంతరం సభా ప్రాంగణానికి చేరుకుంటారు. మొత్తం రూ.6,109 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

First Published:  8 July 2023 6:39 AM IST
Next Story