Telugu Global
Telangana

కోమటిరెడ్డిపై మోడీ ఎఫెక్ట్ తప్పదా?

అసలే గెలుపు కోసం కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి నానా అవస్థ‌లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో చేనేత రంగాన్ని మోడీ ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్ళటం పార్టీకి కచ్చితంగా నష్టం జరిగేదే అనే చర్చ మొదలైంది.

కోమటిరెడ్డిపై మోడీ ఎఫెక్ట్ తప్పదా?
X

మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి బీజేపీలో చేరేముందు వేసుకున్న లెక్కలేవీ ఇప్పుడు అక్కరకు రావటం లేదు. బీజేపీలో చేరేనాటికన్నా నామినేషన్ వేసి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత పరిస్ధితులు అన్యాయంగా తయార‌య్యాయి. సీనియర్ నేతలు పెద్దగా కలిసిరావటం లేదు, లోకల్ నేతల్లో కొందరు సహకరించటం లేదు. ప్రజల్లో కూడా వ్యతిరేకత స్పష్టంగా కనబడుతోంది.

ఇవన్నీ సరిపోవన్నట్లుగా నరేంద్ర మోడీ ఎఫెక్ట్‌ కూడా పడేట్లుంది. ఇంతకీ మోడీ ఎఫెక్ట్ ఏమిటంటే చేనేత రంగాన్ని జీఎస్టీ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం చేర్చటం. చేనేత రంగం పరిస్ధితి అంతంతమాత్రంగానే ఉంది కాబట్టి జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్ళద్దని ఆ రంగంలోని ప్రముఖులు, కొందరు ఎంపీలు కూడా మోడీని పదేపదే కోరారట. అయితే ఎవరి విజ్ఞప్తులను కూడా మోడీ లెక్కచేయకుండా చేనేత రంగాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చేశారు. దీనిపై జాతీయ స్ధాయిలో వ్యతిరేకత మొదలైంది.

ఇందులో భాగంగానే బీజేపీ నేత రాపోలు ఆనందభాస్కర్ రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరటం. జాతీయ స్ధాయిలో వ్యతిరేకత వస్తే ఏమవుతుంది? రాపోలు వల్ల జరిగే నష్టం ఏముంటుంది ? అన్నది పాయింట్ కాదు. అసలు పాయింట్ ఏమిటంటే మునుగోడులో బీసీ ఓటు బ్యాంకు చాలా ఎక్కువన్న విషయం తెలిసిందే. బీసీలంటే గౌడ్లు, యాదవులు, చేనేతలు రకరకాలున్నారు. నియోజకవర్గంలోని మొత్తం బీసీల ఓట్లలో చేనేతల ఓట్లు సుమారు 12 వేలున్నాయట. 12 వేల ఓట్లంటే చిన్న విషయంకాదు. మోడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే రాష్ట్రంలోని వేలాది మంది నేతన్నలు లేఖలు రాస్తున్నారు.

టైట్ ఫైట్ జరిగే ఉపఎన్నికల్లో ప్రతి ఓటూ ఎంతో ముఖ్యమైనదని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పది ఓట్లతో కూడా ఫలితం తారుమారైపోతుంది. అసలే గెలుపు కోసం కోమటిరెడ్డి నానా అవస్థ‌లు పడుతున్నారు. ఇలాంటి సమయంలో చేనేత రంగాన్ని మోడీ ప్రభుత్వం జీఎస్టీ పరిధిలోకి తీసుకెళ్ళటం పార్టీకి కచ్చితంగా నష్టం జరిగేదే అనే చర్చ మొదలైంది. జీఎస్టీ విషయంలో కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు మునుగోడులో కూడా వ్యతిరేకత మొదలైతే దాని ప్రభావం బీజేపీపై నెగిటివ్‌గా పడుతుందనటంలో సందేహం అవసరమేలేదు. చూస్తుంటే కోమటిరెడ్డి గెలుపుపై మోడీ ఎఫెక్ట్ తప్పదేమో అనిపిస్తోంది.

First Published:  25 Oct 2022 12:12 PM IST
Next Story