Telugu Global
Telangana

ఎన్నికల ఏడాదిలో తెలంగాణపై మోదీ, అమిత్ షాకి పుట్టుకొస్తున్న కొత్త ప్రేమ..

రాబోయే 6 నెలల్లో నెలకోసారి మోదీ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా.. నెలలో కనీసం రెండుసార్లు తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలంటున్నారు.

ఎన్నికల ఏడాదిలో తెలంగాణపై మోదీ, అమిత్ షాకి పుట్టుకొస్తున్న కొత్త ప్రేమ..
X

ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే ఆ రాష్ట్రంపై కొత్తగా బీజేపీ అధినాయకత్వానికి ప్రేమ పుట్టుకు రావడం సహజం. ఎన్నికల ఏడాదిలో ఆ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జోరందుకుంటాయి. రెండు వారాలకు ఒకరు చొప్పున వంతులు వేసుకుని మరీ మోదీ, అమిత్ షా ఆ రాష్ట్రం చుట్టూ చక్కర్లు కొడతారు. తాజాగా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగుస్తుండగా, తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెంచింది.

ఉభయకుశలోపరి..

సోమవారం కర్నాటక ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. అంటే అక్కడ కోడ్ అమలులో ఉంటుంది. కానీ బీజేపీ ఇంకా ఓటర్లను ప్రలోభ పెట్టాలనుకుంటోంది. దీంతో కర్నాటక సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ ప్రాంతంలో అమిత్ షా, జేపీ నడ్డా సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ లేదా నారాయణ్ పేట్ లో ఈనెల 9న బీజేపీ బహిరంగ సభ ఉంటుందని తెలుస్తోంది.

కర్నాటక ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇక ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన తెలంగాణపై బీజేపీ పూర్తి ఫోకస్ పెట్టాలనుకుంటోంది. కేంద్ర మంత్రులు, ముఖ్య నేతల పర్యటనల ద్వారా పార్టీ కేడర్‌ లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఏప్రిల్ 8న వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం కోసం హైదరాబాద్‌ వచ్చిన ప్రధాని మోదీ.. ఈనెలలో మరోసారి ఇక్కడకు రాబోతున్నారు. వరంగల్‌ లో టెక్స్‌ టైల్‌ పార్కు ప్రారంభోత్సవానికి ఆయన వస్తారని బీజేపీ వర్గాల సమాచారం. రాబోయే 6 నెలల్లో నెలకోసారి మోదీ పర్యటన ఉంటుందని చెబుతున్నారు. అమిత్ షా, జేపీ నడ్డా నెలలో కనీసం రెండుసార్లు తెలంగాణకు వస్తారని బీజేపీ నేతలంటున్నారు.

అభివృద్ధి పథకాలు, నిధుల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏమాత్రం సహకరించని కేంద్రం.. ఎన్నికల టైమ్ దగ్గరపడేసరికి ఇప్పుడు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలంటూ హడావిడి చేయడానికి రెడీ అవుతోంది. విభజన హామీల అమలుకే ఇంకా దిక్కులేదు కానీ ఇప్పుడు కొత్తగా తెలంగాణపై ప్రేమ కురిపించడానికి కేంద్రంలోని పెద్దలు రెడీ అయిపోయారు. అయితే ఈ జిమ్మిక్కులన్నిటినీ తిప్పికొట్టడానికి ఇక్కడ బీఆర్ఎస్ కూడా సిద్ధంగానే ఉంది.

First Published:  7 May 2023 10:34 AM IST
Next Story