కేసీఆర్ ఢిల్లీకి వస్తారన్నదే మోదీ భయం..
తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. అన్నీ కేసీఆరేనని చెప్పారు, అందుకే మన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు కేటీఆర్. ప్రతిపక్షాలకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, యాక్టర్ పక్కోడు.. వాళ్లది డిజాస్టర్ అని సెటైర్లు పేల్చారు.
తెలంగాణలో కేసీఆర్ మళ్లీ సీఎం అయితే ఊరుకోరు.. మహారాష్ట్రలో అడుగు పెడతారు, కర్నాటకలో అడుగు పెడతారు, తర్వాత ఢిల్లీలో గులాబీ జెండా పాతాలని చూస్తారని.. అందుకే ఆయన్ను చూసి నరేంద్రమోదీ భయపడుతున్నారని చెప్పారు మంత్రి కేటీఆర్. మోదీ, రాహుల్ గాంధీ.. ఇద్దరికీ కేసీఆర్ కొరకరాని కొయ్యలా తయారయ్యాని చెప్పారు. కేసీఆర్ ఢిల్లీకొస్తే తమ కొంప మునుగుతుందని అందుకే ఇక్కడే ఖతం చేయాలని చూస్తున్నారని అన్నారు. మోదీ ఢిల్లీ గద్దనెక్కితే.. తెలంగాణలో ఇస్తున్నట్లుగా 24 గంటల కరెంట్ దేశమంతా ఇస్తారని, దేశమంతా రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి అమలు చేస్తారని.. అదే ఆయన ఆశయం అని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు.
కేసీఆర్ సెంచరీ..
విరాట్ కోహ్లీలాగా రాష్ట్రంలో కేసీఆర్ సెంచరీ కొట్టి మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని అన్నారు మంత్రి కేటీఆర్. ఎల్లారెడ్డిపేట యువ సమ్మేళనం వేదికపై ఆయన స్టెప్పులేసి జోష్ పెంచారు. ఎన్నికల పాట ‘దేఖ్ లేంగే’కు వేదికపై ఉన్న నాయకులతో కలిసి నృత్యం చేశారు కేటీఆర్.
జాబ్ క్యాలెండర్ నా బాధ్యత..
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించే బాధ్యత తనదేనని చెప్పారు మంత్రి కేటీఆర్. జిల్లాకో నైపుణ్య శిక్షణ కేంద్రం, నియోజకవర్గానికో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేసి పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, స్వయం ఉపాధిని పెంచుతామని చెప్పారు. తెలంగాణను దాచి దాచి దయ్యాల పాలు చేయొద్దని, ఎవరి చేతిలో ఉంటే తెలంగాణ పచ్చగా ఉంటుందో ఆలోచించాలని కోరారు కేటీఆర్.
మనది బ్లాక్ బస్టర్, వారిది డిజాస్టర్..
తెలంగాణలో కాంగ్రెస్ కు, బీజేపీకి లోకల్ లీడర్లు లేక.. కర్నాటక, ఢిల్లీ, గుజరాత్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు కేటీఆర్. కానీ తెలంగాణ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. అన్నీ కేసీఆరేనని చెప్పారు, అందుకే మన సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు. ప్రతిపక్షాలకు కన్నడ ప్రొడ్యూసర్, ఢిల్లీ డైరెక్టర్, యాక్టర్ పక్కోడు.. వాళ్లది డిజాస్టర్ అని సెటైర్లు పేల్చారు. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో ఉస్కో అంటే.. ఇక్కడ డిస్కో అంటారని కౌంటర్ ఇచ్చారు.