తెలంగాణలో రెండు రోజులు మోస్తరు వర్షాలు..పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రాబోయే రెండురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణలో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర్ తెలిపింది.పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశముందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఐఎండీ తెలిపింది. ఈ నెల 22, 23 తేదీల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందని.. పారాదీప్‌కు 700 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది.
పశ్చిమ వాయువ్య దిశగా కదిలి తూర్పు మధ్య బంగాళాఖాతంలో బుధవారం నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని చెప్పింది. ఆ తర్వాత వాయువ్య దిశగా కదులుతూ 24వ తేదీ వరకు తీవ్ర తుఫానుగా మారుతుందని హెచ్చరించింది. ఈ నెల 22న భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైద్రాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. 23న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.