Telugu Global
Telangana

హైదరాబాద్ టు సూడాన్.. సెల్ ఫోన్ జర్నీ

మీ సెల్ ఫోన్ పోయిందా..? కంప్లయింట్ చేయడం ఆలస్యంచేస్తే అది దేశం కూడా దాటేయొచ్చు. నేరుగా సూడాన్ కు వెళ్లిపోయి ఉండొచ్చు.

హైదరాబాద్ టు సూడాన్.. సెల్ ఫోన్ జర్నీ
X

సెల్ ఫోన్ దొంగతనం చేస్తే ఏం చేస్తారు..? సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు కొనే షాపులకు వాటిల్ని అమ్మేస్తారు. ఆ తర్వాత పౌచ్ లు మార్చి, ప్యానెళ్లు మార్చి వాటిని మళ్లీ మార్కెట్లోకి తెస్తుంటారు. ఇటీవల ఐఎంఈఐ నెంబర్లు కూడా మార్చేసి అమ్మేస్తున్నారు. మరికొంతమంది ఏకంగా వాటిని విదేశాలకు సరఫరా చేస్తున్నారు. విదేశాల్లో గిరాకీ ఉన్న మోడళ్లను అలాగే పంపిస్తున్నారు, మిగతా వాటిని పగలగొట్టి కేవలం విడి భాగాలను పార్శిల్ చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ నుంచి సూడాన్ కు దొంగిలించిన సెల్ ఫోన్లు పార్శిల్ చేస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 2 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

జర్నీ ఇలా..

హైదరాబాద్ లో సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాలు ఉన్నాయి. గుంపుల్లో కలసిపోయి సెల్ ఫోన్లు కొట్టేయడం, ఒంటరిగా వెళ్తున్న వారిని బెదిరించి సెల్ ఫోన్లు కాజేయడం, ఎదురు తిరిగితే దాడి చేయడం, హత్యకు కూడా వెనకాడకపోవడం వీరి నైజం. పోలీసులు చాకచక్యంగా కొన్ని కేసులు సాల్వ్ చేస్తున్నా.. ఈ ముఠా మరో అడుగు ముందుకేసింది. అసలు సెల్ ఫోన్లు దేశంలోనే లేకుండా చేస్తోంది. ప్రస్తుతం సూడాన్ దేశానికి వీరు సముద్ర మార్గం ద్వారా సెల్ ఫోన్లు చేరవేస్తున్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సూడాన్ దేశస్తుడు మహ్మద్‌ ముసా హస్సాన్‌ గామ్రాల్నాబియ తోపాటు నగరానికి చెందిన 30మంది ఉన్నారు. వీరంతా సెల్ ఫోన్ స్నాచర్లు, టెక్నీషియన్లు. హైదరాబాద్ లో సెల్ ఫోన్ కొట్టేసినవారు ముందుగా వాటిని టెక్నీషియన్ల వద్దకు చేరుస్తారు. వెంటనే ఐఎంఈఐ నెంబర్ మార్చేస్తారు. బిజినెస్‌ వీసాపై సూడాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి నానల్‌నగర్‌లో నివాసముంటున్న మహ్మద్ ముసా వీటిని కొని తాను ఉంటున్న ఇంటిలో భద్రపరుస్తాడు. ఆ తర్వాత బల్క్ గా వాటిని సముద్ర మార్గం ద్వారా దేశం దాటిస్తాడు. ఇలా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ ముఠా కార్యకలాపాలకు ఇప్పుడు బ్రేక్ పడింది. సెల్ ఫోన్ దోపిడీ ముఠాలపై పోలీసులు నిఘా పెట్టడంతో ఈ వ్యవహారం అంతా బయటపడింది.

First Published:  27 May 2024 9:10 AM IST
Next Story