నేడు ఎంఎన్‌జే ఆసుపత్రిలో కొత్త బ్లాక్ ప్రారంభం.. ఇది ఆరోగ్య తెలంగాణకు నిదర్శనమని హరీశ్ రావు వ్యాఖ్య
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఈ కొత్త ఆంకాలజీ భవనం నిదర్శనమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న ఎంఎన్‌జే ఆసుపత్రి ప్రస్తుతం 450 పడకలతో రోగులకు సేవలు అందిస్తోంది. దీనికి అదనంగా మరో 300 బెడ్ల సామర్థ్యంతో కొత్త ఆంకాలజీ బ్లాకును అత్యంత ఆధునిక వసతులతో నిర్మించారు. అరబిందో ఫార్మా సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన ఈ కొత్త బ్లాక్‌ను ఆదివారం ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ దార్శనికతకు ఈ కొత్త ఆంకాలజీ భవనం నిదర్శనమని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆదివారం ప్రారంభించనున్న కొత్త బ్లాక్ ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌గా కొంత కాలం క్రితమే ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిని అప్‌గ్రేడ్ చేశారు. ఇప్పటి వరకు ఉన్న పాత బ్లాక్‌లో 450 బెడ్లతో రోగులకు వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే రోగుల తాకిడి పెరగడంతో రూ.80 కోట్ల వ్యయంతో కొత్త ఆంకాలజీ బ్లాక్‌ను క్యాంపస్‌లో నిర్మించారు. ఈ కొత్త బ్లాక్‌ను అరబిందో ఫార్మా తమ సీఎస్ఆర్ నిధులను వెచ్చించి నిర్మించింది.
ఎంఎన్‌జే కొత్త ఆంకాలజీ బ్లాక్ 2,32,000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉన్నది. పాత బ్లాక్ పక్కనే 2 ఎకరాల స్థలంలో దీన్ని నిర్మించారు. సెల్లార్, లోయర్ గ్రౌండ్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో ఐదు అంతస్థులను నిర్మించారు. రోగులు, అటెండెట్లు, వైద్య సిబ్బంది సులువుగా వెళ్లడానికి మెట్లు, ర్యాంప్‌లతో పాటు లిఫ్ట్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని పేదలకు క్యాన్సర్ వైద్య సేవలు ఉచితంగా అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాక్‌ను నిర్మించినట్లు అధికారులు చెప్పారు.
In tune to Hon’ble CM Sri #KCR garu’s vision of #ArogyaTelangana, delighted to share that I will be inaugurating a new 300-bed oncology block in addition to the existing 450-bed MNJ Cancer Hospital tomorrow. pic.twitter.com/pMIH8WAXvP
— Harish Rao Thanneeru (@BRSHarish) April 15, 2023