Telugu Global
Telangana

భవిష్య‌త్తులో కూడా కలిసే సాగాలని టీఆరెస్, సీపీఐ నిర్ణయం

మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టుల సహకారం వల్ల తాము విజయం సాధించామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. టీఆరెస్ గెలుపుకు కృషి చేసినందుకు ఈ రోజు టీఆరెస్ నేతలు సీపీఐ కార్యాలయానికి వెళ్ళి ఆ పార్టీ నేతలకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

భవిష్య‌త్తులో కూడా కలిసే సాగాలని టీఆరెస్, సీపీఐ నిర్ణయం
X

మునుగోడు ఎన్నికల్లో కలిసి పని చేయడం వల్ల వచ్చిన విజయంతో భవిష్యత్తులో కూడా కలిసే ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆరెస్), భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) లు నిర్ణయించుకున్నాయి.

మునుగోడు ఎన్నికల్లో టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపునకు కృషి చేసిన సీపీఐ, సీపీఎంలకు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ లు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ముగ్గురూ ఈ రోజు సీపీఐ కార్యాలయం ముక్దుం భవన్ కు వెళ్ళారు.

ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబ‌శివ‌రావు, చాడా వెంకట రెడ్డి, పల్లా వెంకట రెడ్డి ల‌ను క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వీరి సమావేశం అనంతరం జగదీష్ రెడ్డి, సాంబ‌శివ‌రావు, ప్రభాకర్ రెడ్డిలు మీడియాతో మాట్లాడారు.

''మునుగోడు టీఆరెస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపులో వామపక్షాల పాత్ర చాలా ఉంది. టీఆరెస్ గెలుపు కోసం వారు తీవ్రంగా కృషి చేశారు. తెలంగాణలో పాలన సాఫీగా సాగుతుంటే అది గిట్టని బీజేపీ ఉప ఎన్నికను తీసుకొచ్చి అలజడి సృష్టించాలని ప్రయత్నించింది. అయితే కమ్యూనిస్టుల సహకారంతో బీజేపీ కుట్రను తిప్పికొట్టగలిగాం. ఇకపై వామపక్షాలతో కలిసి దేశంలో బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాం. భ‌విష్య‌త్‌లోనూ ఐక్యంగా క‌లిసి ముందుకు వెళ్తాం.'' అని మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి అన్నారు.

బీజేపీని ఓడించడం ద్వారా రాష్ట్రాన్ని పెద్ద విప‌త్తు నుంచి కాపాడామని కూనంనేని సాంబ‌శివ‌రావు అన్నారు. మునుగోడులో ఓడి పోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించిన రాజగోపాల్ రెడ్డి రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటార‌ని ఆయన ప్రశ్నించారు.

సీపీఎం, సీపీఐ నేతల స‌హ‌కారంతో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన ప్రభాకర్ రెడ్డి తన‌ విజ‌యానికి స‌హ‌క‌రించిన సీపీఎం, సీపీఐ నేత‌ల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు చెప్పారు.

First Published:  8 Nov 2022 11:44 AM GMT
Next Story