Telugu Global
Telangana

బీఆర్ఎస్ తోనే నా ప్రయాణం.. ఎమ్మెల్సీ పట్నం క్లారిటీ

ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం బీజేపీ టికెట్ పై తాండూరు నుంచి పోటీ చేస్తారనేది ఆ పుకార్ల సారాంశం. ఈ దశలో పట్నం కాస్త ఘాటుగా స్పందించారు.

బీఆర్ఎస్ తోనే నా ప్రయాణం.. ఎమ్మెల్సీ పట్నం క్లారిటీ
X

తెలంగాణలో ఎన్నికలకు టైమ్ దగ్గరపడేకొద్దీ వలసలపైనే బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది. నయానో భయానో కీలక నేతల్ని తమవైపు తిప్పుకోడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. కొంతమందిపై ఉద్దేశపూర్వకంగానే పుకార్లు మొదలుపెట్టింది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరతారంటూ ఇటీవల బీజేపీ నేతలు ప్రచారం మొదలు పెట్టారు. సోషల్ మీడియాలో కూడా ఇవే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో తనపై వస్తున్న పుకార్లపై ఎమ్మెల్సీ పట్నం క్లారిటీ ఇచ్చారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలను ఖండించారు.

తాండూరే కీలకం..

1994లో టీడీపీ తరపున తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తొలిసారి గెలుపొందిన పట్నం మహేందర్ రెడ్డి ఆ తర్వాత 2014లో టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కేసీఆర్ మంత్రి వర్గంలో పనిచేశారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతో తాండూరుపై తన పెత్తనం తగ్గిపోతుందని పట్నం మహేందర్ రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. 2019లో పట్నం ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత కాస్త పరిస్థితి మెరుగుపడిందని అంటున్నారు. అయితే ఇటీవల మళ్లీ ఆయనపై పుకార్లు మొదలయ్యాయి.

ఈ ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం బీజేపీ టికెట్ పై తాండూరు నుంచి పోటీ చేస్తారనేది ఆ పుకార్ల సారాంశం. ఈనెల 23న చేవెళ్లలో జరిగే కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని కూడా అంటున్నారు. ఈ దశలో పట్నం కాస్త ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నవారంతా దద్దమ్మలంటూ మండిపడ్డారు. తాను బీఆర్ఎస్ ని వీడబోనని చెప్పారు. కేసీఆర్ నాయకత్వంపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరారు. మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులంతా బీఆర్ఎస్ లోనే ఉండటం, తాజాగా ఆయనే క్లారిటీ ఇవ్వడంతో ఈ పార్టీ మార్పు వ్యవహారం వట్టి పుకారేనని తేలిపోయింది.

First Published:  19 April 2023 2:43 PM IST
Next Story