బీఆర్ఎస్ హుజూరాబాద్ ఇంచార్జిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి.. టికెట్ ఇక ఖాయమేనా?
ఉపఎన్నిక సందర్భంగా కౌశిక్ సేవలకు గుర్తింపుగాను సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడమే కాకుండా, విప్‌గా నియమించారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇంచార్జిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్ నియామక పత్రాన్ని జారీ చేసినట్లు బీఆర్ఎస్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చారు. అప్పుడే ఆయనకు టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగినా.. మొదటి నుంచి అక్కడ వర్క్ చేసిన గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించారు.
ఉపఎన్నిక సందర్భంగా కౌశిక్ సేవలకు గుర్తింపుగాను సీఎం కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టడమే కాకుండా, విప్‌గా నియమించారు. హుజూరాబాద్‌లో సిట్టింగ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ.. కౌశిక్ రెడ్డి ప్రజల్లోకి దూసుకొని వెళ్తున్నారు. ఇటీవల జమ్మికుంటలో జరిగిన ఒక బహిరంగ సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కౌశిక్‌ను ఆశీర్వదించాల్సిందిగా ప్రజలను కోరారు. అప్పుడే కౌశిక్‌కు టికెట్ ఖాయమనే చర్చ జరిగింది. కౌశిక్‌ను కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని, ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.
ఈ క్రమంలో హుజూరాబాద్ ఇంచార్జిగా ఏకంగా సీఎం కేసీఆర్ నియామక పత్రాన్ని జారీ చేయడంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. కౌశిక్ రెడ్డికి ఈ సారి బీఆర్ఎస్ నుంచి టికెట్ ఖాయమేననే చర్చ జరుగుతోంది. తనపై భరోసా ఉంచి ఇంచార్జి పదవి ఇచ్చినందుకు పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కౌశిక్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.