Telugu Global
Telangana

గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా..?

కవిత స్పందన ఘాటుగా ఉంది. గాంధీలు, బంట్రోతులు అంటూ ఓ రేంజ్ లో ఆమె ఫైర్ అయ్యారు.

గ్యారంటీలకు గాంధీలు, క్షమాపణలకు బంట్రోతులా..?
X

అమర వీరుల మరణాల విషయంలో చిదంబరం వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ఆ మరణాల విషయంలో కాంగ్రెస్ ని క్షమించండి అంటూ చిదంబరం చెప్పడాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. హంతకుడే క్షమాపణ చెప్పినట్టుగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. క్షమాపణ చాలా ఆలస్యమైందని, అయితే ఆ మరణాల విషయంలో కాంగ్రెస్ క్షమాపణ చాలా చిన్నదని అన్నారు మంత్రి కేటీఆర్. తాజాగా ఎమ్మెల్సీ కవిత కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. అయితే కవిత స్పందన ఘాటుగా ఉంది. గాంధీలు, బంట్రోతులు అంటూ ఓ రేంజ్ లో ఆమె ఫైర్ అయ్యారు.


క్షమాపణకు చిదంబరమే ఎందుకు..?

తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ, క్షమాపణ కూడా ఆ పార్టీ అధినేతలు చెబితే బాగుండేది, కానీ చిదంబరం చెప్పడంలో ఆంతర్యమేంటి అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. గ్యారెంటీలు ప్రకటించడానికి మాత్రం గాంధీలు తెలంగాణకు వస్తారా, క్షమాపణలు చెప్పేది మాత్రం వారి బంట్రోతులా అని నిలదీశారు.

ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన గాంధీలు కనీసం స్వయంగా క్షమాపణ చెప్పలేరా..? అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. పదేళ్లలో ఒక్కసారి కూడా మీ కుటుంబానికి వందలాదిమంది తల్లుల కడుపు కోత గుర్తు రాకపోవడం బాధాకరం.. అంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ గడ్డమీద జోడోయాత్రలు చేసి ఒక్కసారి కూడా జైతెలంగాణ చెప్పకపోవడం దారుణం అని రాహుల్ గాంధీని విమర్శించారు కవిత. సోనియా, రాహుల్.. ఇద్దరూ అమర వీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదన్నారు.

First Published:  17 Nov 2023 11:04 AM IST
Next Story