Telugu Global
Telangana

బెయిలివ్వని కోర్టు.. తీహార్ జైలుకి కవిత

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. అటు కవితకు బెయిలివ్వలేదు, ఇటు ఈడీ కస్టడీకి కూడా అనుమతివ్వలేదు. ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

బెయిలివ్వని కోర్టు.. తీహార్ జైలుకి కవిత
X

ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. దీంతో ఆమెను తీహార్ జైలుకి తరలిస్తున్నారు అధికారులు. ఈరోజు కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కవితను మరో 15 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి ఇవ్వాలని ఈడీ, కోర్టుని అభ్యర్థించింది. అదే సమయంలో తన కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిలివ్వాలని కవిత కూడా కోర్టుని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు.. అటు కవితకు బెయిలివ్వలేదు, ఇటు ఈడీ కస్టడీకి కూడా అనుమతివ్వలేదు. ఆమెకు జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.

ఎమ్మెల్సీ కవితకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ సమయంలో ఆమె తీహార్ జైలులో ఉంటారు. అయితే ఏప్రిల్‌ 1వ తేదీన కవిత బెయిల్‌ పిటిషన్‌పై మరోసారి వాదనలు జరిగే అవకాశముంది. ఈరోజు కోర్టుకు హాజరైన కవితతో ఆమె భర్త అనిల్, బంధువులు మాట్లాడారు. కోర్టు హాలులో వారు కవితను కలిశారు.

కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకొచ్చిన సందర్భంలో కవిత మీడియాతో మాట్లాడారు. ఇది మనీల్యాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ ల్యాండరింగ్‌ కేసు అని ఆరోపించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు బీజేపీలో చేరుతున్నారని, వారికి బీజేపీ టికెట్లు కూడా ఇస్తోందని చెప్పారు. ఇంకొందరు బీజేపీకి ఎన్నికల విరాళం కూడా ఇచ్చారని.. కేసుల పేరుతో బీజేపీ వారిని భయపెడుతోందని అన్నారు. తాత్కాలికంగా తనను జైలులో పెట్టినా.. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం వారి తరం కాదన్నారు కవిత. ఎలాంటి తప్పు చేయని తాను అప్రూవర్ గా మారే ప్రశ్నే లేదన్నారు.

First Published:  26 March 2024 1:43 PM IST
Next Story