Telugu Global
Telangana

ఆయన రాహుల్ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీ

"టూరిస్టులు రావొచ్చు.. వెళ్లొచ్చు. రాహుల్‌ జీ ఇక్కడికి రండి.. అంకాపూర్‌ చికెన్‌ తినండి.. అన్నీ చూడండి.. కానీ, ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి." అని అన్నారు కవిత.

ఆయన రాహుల్ గాంధీ కాదు.. ఎన్నికల గాంధీ
X

ఎక్కడ ఎన్నికలుంటే అక్కడికి రాహుల్ గాంధీ వస్తారని.. ఆయన పేరు ఎన్నికల గాంధీ అని మార్చుకోవాలంటూ సెటైర్లు పేల్చారు ఎమ్మెల్సీ కవిత. మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ నిజామాబాద్ కూడా వస్తున్నారు. ఈ సందర్భంలో కవిత ఆయనపై విమర్శలు చేశారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ బలంగా ఉందని, అందుకే నాయకులంతా ఇక్కడకు వస్తున్నారని అన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ వచ్చి వెళ్లారని, ఇప్పుడు రాహుల్ వస్తున్నారని చెప్పారు కవిత.

"టూరిస్టులు రావొచ్చు.. వెళ్లొచ్చు. రాహుల్‌ జీ ఇక్కడికి రండి.. అంకాపూర్‌ చికెన్‌ తినండి.. అన్నీ చూడండి.. కానీ, ఇక్కడి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టకండి." అని అన్నారు కవిత. బీసీ గణన గురించి రాహుల్‌ చెప్పాల్సిన అవసరం లేదన్నారామె. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీల ప్రభుత్వం అని చెప్పారు. వ్యవసాయాన్ని పండుగలా సీఎం కేసీఆర్ మార్చారని, బీఆర్ఎస్ హయాంలో సాగునీటి రంగం పూర్తిగా అభివృద్ధి చెంది మూడు పంటలు సాగవుతున్నాయని చెప్పారు కవిత. బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు మైండ్‌ బ్లాంక్‌ అయిందని, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రస్ట్రేషన్‌తో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగింది చంద్రబాబు హయాంలో అని, రాహుల్‌ ఆ విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు కవిత. నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ కార్మికులు, రైతులకు నష్టం జరగకుండా ఆదుకున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అని చెప్పారు. రాహుల్‌ అవాకులు, చెవాకులు పేలుతున్నారని అన్నారు. గడిచిన పదేళ్లలో తెలంగాణలో ఒక్క చోట కూడా మత కల్లోలం జరగలేదని, తమ పాలనకు అదే నిదర్శనం అని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధికోసం.. కాంగ్రెస్, బీజేపీలు ఒకరినొకరు తిట్టుకుంటారని, సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తారని అన్నారు కవిత. ప్రధాని మోదీ బీఆర్‌ఎస్‌ పథకాలను కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు.

First Published:  18 Oct 2023 12:45 PM IST
Next Story